Telangana Govt: కుల ధ్రువీకరణ పత్రాల జారీ పద్దతిని వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రోజుల తరబడి వేచి ఉండే విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. పత్రాలు దరఖాస్తు చేసుకున్న నిమిషంలోపే జారీ అవుతున్నాయి. రెండు వారాలుగా ఈ పద్దతి అమల్లో ఉన్నట్లు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. కొత్త పద్దతిలో విద్యార్థులు తల్లిదండ్రులు ఫుల్‌ఖుషీ.
టెక్నాలజీ వచ్చాక అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది. అయినా ప్రజలకు ప్రభుత్వ సేవల్లో ఎలాంటి మార్పులు రావడంలేదు. ఇక విద్యార్థుల ఆదాయ, కుల, ధ్రువీకరణ పత్రాల గురించి చెప్పనక్కర్లేదు. తొలిసారి దరఖాస్తు చేస్తే అన్ని వెరిఫికేషన్ చేసి ప్రజల చేతికి ఆ పత్రాలు వచ్చేసరికి నెలకు పైగానే పడుతుంది. రెండోసారి దరఖాస్తు చేస్తే దాదాపు వారం పడుతుంది. ఇక తెలంగాణ విషయానికి వద్దాం.
మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నాలుగైదు రోజులకు ఫోన్‌కి మేసేజ్ వస్తుంది. దాని తర్వాత రెండు మూడురోజులకు కుల, ఆదాయ, నివాసం పత్రాలను తీసుకోవడం జరుగుతోంది. ఈ తతంగం పూర్తయ్యే సరికి దాదాపు వారం పడుతుంది. దీన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్దతిని తెరపైకి తెచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న నిమిషం వ్యవధిలో సర్టిఫికెట్ చేతికి రానుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా వెల్లడించారు.
గడిచిన రెండువారాలుగా కొత్త పద్దతి అమలులో ఉందని తెలిపారు. స్వల్ప కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 17,500 మందికి పైగా కుల ధ్రువీకరణ పత్రాలు పొందారని వెల్లడించారు. కొత్త విధానం వల్ల ఏటా సుమారు 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కొత్త సర్టిఫికెట్ కోసం అధికారుల ఆమోదం కోసం చూడాల్సిన అవసరం లేదు. గతంలో తీసుకున్న సర్టిఫికెట్ నెంబర్ తెలిస్తే దాని ఆధారంగా వెంటనే కొత్త పత్రాన్ని క్షణాల్లో పొందవచ్చు.
ALSO READ: మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
పాత నెంబర్ అందుబాటులో లేకపోతే జిల్లా, మండలం, గ్రామం పేరుతో సెర్చ్ చేసి ఈజీగా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేరుగానీ ఇంటిపేరు మార్పులైతే కచ్చితంగా జిల్లా అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. 2020 సెప్టెంబర్ 9 నాటి జీవో నెంబర్ 3 ప్రకారం హిందూ కమ్యూనిటీ నుంచి క్రైస్తవ మతంలోకి మారినవారికి పాత ఆమోద ప్రక్రియ వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.