E-Paper

PHC Negligence: చల్లూర్ పీహెచ్‌సీలో రోగుల ప్రాణాలతో చెలగాటం!

PHC Negligence: చల్లూర్ పీహెచ్‌సీలో రోగుల ప్రాణాలతో చెలగాటం!

PHC Negligence: స్వేచ్ఛ బ్యూరో: వీణవంక మండల పరిధిలోని చల్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. రోగాల బారిన పడి, త్వరితగతిన ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ఆసుపత్రికి వస్తున్న నిరుపేద రోగుల ప్రాణాలతో అక్కడి సిబ్బంది చెలగాట మాడుతున్నారు. వివిధ రకాల శారీరక రుగ్మతలతో బాధపడుతూ, వైద్యుల సూచనల మేరకు పరీక్షల నిమిత్తం వచ్చిన రోగుల నుంచి ల్యాబ్ టెక్నీషియన్ రక్త నమూనాలను (బ్లడ్ శాంపిల్స్) సేకరిస్తున్నారు.అయితే మూడు రోజులు గడుస్తున్నా వాటిని ఉన్నత ల్యాబొరేటరీలకు పంపించకుండా గదిలోనే మూలన పడేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

నిబంధనలు బేఖాతరు.. ఫ్రిడ్జ్‌కే పరిమితమైన శాంపిల్స్!

వైద్యుల సూచనల మేరకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి తదితర అత్యవసర రక్త పరీక్షల కోసం చల్లూర్, దాని పరిసర గ్రామాల ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. నిబంధనల ప్రకారం.. రోగుల వద్ద సేకరించిన బ్లడ్ శాంపిల్స్ వివరాలను ల్యాబ్ టెక్నీషియన్ వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆపై కరీంనగర్‌లోని ‘టీ-హబ్’ (T-Hub)కు పంపించాల్సి ఉంటుంది. సెలవు దినాలు మినహా ప్రతిరోజూ మధ్యాహ్నం 1:00 గంట నుండి 2:00 గంటల మధ్యలో టీ-హబ్‌కు చెందిన ప్రత్యేక వాహనం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈ నమూనాలను సేకరిస్తుంది. అలా సేకరించిన శాంపిల్స్ నివేదికలు (రిపోర్ట్స్) 24 నుండి 72 గంటల్లోగా తిరిగి ఆసుపత్రికి చేరుకుంటాయి.

నిర్లక్ష్యంగా ఆసుపత్రిలో..

అయితే, చల్లూర్ పీహెచ్‌సీ ల్యాబ్ టెక్నీషియన్ మాత్రం గత గురు, శుక్రవారాల్లో సేకరించిన రక్త నమూనాలను ఆన్‌లైన్ చేయకుండా, కనీసం టీ-హబ్ వాహనానికి కూడా అప్పగించకుండా నిర్లక్ష్యంగా ఆసుపత్రిలోని ఫ్రిడ్జ్‌లోనే భద్రపరిచారు. సాధారణంగా రక్త నమూనాలను సేకరించిన కొన్ని గంటల్లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ మూడు రోజులు దాటినా వాటిని అలాగే నిల్వ ఉంచడం వల్ల ఆ నమూనాలు పాడైపోయే ప్రమాదం ఉందని, తద్వారా తప్పుడు నివేదికలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also read: TG Ration Card: ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. అయినా రేషన్ కార్డు జారీ!

నివేదికలు రాక నిలిచిన వైద్యం.. ప్రైవేటే శరణ్యం!

ల్యాబ్ రిపోర్టులు వస్తే తప్ప ఏ వ్యాధి సోకిందో తెలియక, సరైన వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలు రాసిన వైద్యులు.. “రిపోర్టులు రాగానే మళ్లీ కలవండి” అని చెబుతుండటంతో, బాధితులు నివేదికల కోసం పీహెచ్‌సీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేతిలో పైసలు లేక ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుంటే, ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఏర్పడిందని పలు గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరిగినా రిపోర్టులు రాకపోవడంతో, నిరీక్షించి విసిగిపోయిన నిరుపేద రోగులు విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులను, ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మళ్లీ భారీగా డబ్బులు చెల్లించి, రెండోసారి రక్తాన్ని ఇచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

నా డ్యూటీ ఇంతే.. బాధ్యతారాహిత్యంగా సమాధానాలు!

ఈ ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇదే తీరుగా వ్యవహరించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై రిపోర్టుల కోసం వచ్చిన రోగులు సదరు ల్యాబ్ టెక్నీషియన్‌ను నిలదీస్తే.. అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. “నాకు వీణవంకలో మూడు రోజులు, చల్లూర్ లో మూడు రోజులు డ్యూటీ ఉంటుంది.. నా దగ్గర రిపోర్టులు ఉండవు, నేను శాంపిల్స్ పంపించడం వరకే నా పని.. రిపోర్టులు వచ్చినప్పుడు మీకే ఇస్తాను” అంటూ సమాధానం చెబుతూ తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి..

గత మూడు రోజులుగా బ్లడ్ శాంపిల్స్ ఇక్కడే ఉంచుకుంటే మాకు రిపోర్టులు ఎప్పుడు వస్తాయి? వైద్యం ఎప్పుడు అందుతుంది? ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేకనే ఇక్కడికి వచ్చాం. ఉన్నతాధికారులు స్పందించి చల్లూర్ పీహెచ్‌సీ ల్యాబ్ టెక్నీషియన్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రోగులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు (DMHO) తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి నిరుపేద రోగులకు సరైన సమయంలో వైద్యం అందేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Related News

Heavy Rains: హైదరాబాద్‌కు భారీ వర్షాల ముప్పు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

HYDRAA Bikes: హైడ్రా బైక్ టీమ్స్ హల్చల్.. భారీ విపత్తుల కోసం సీఎం రేవంత్ తెచ్చిన సరికొత్త ఆర్మీ!

Miss Universe: తళుక్కుమన్న మిస్ యూనివర్స్ తెలంగాణ.. నేషనల్ లెవెల్కు ఇద్దరు ఎంపిక..!

Huzurabad: హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి.. వొడితల ప్రణవ్ హైవోల్టేజ్ సవాల్..?

Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Tank Neglect: జహీరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న రైతుల పొలాలు!

TG Ration Card: ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. అయినా రేషన్ కార్డు జారీ!

×