Chamala Kiran: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కిషన్ రెడ్డిపై విమర్శలు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసి మరీ బీజేపీని గెలిపించిందని కిరణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ కృతజ్ఞతతోనే కిషన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌కు సహాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు అప్పుడు ఎటు వెళ్లాయని.. బీఆర్ఎస్ దోపిడీని అరికట్టి ఉంటే తెలంగాణ నేడు సస్యశ్యామలంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి.. రాష్ట్రం గురించి ఆలోచించని ఏకైక నాయకుడు కిషన్ రెడ్డి అని విమర్శించారు.
బండి సంజయ్‌కు కౌంటర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరిని కూడా ఎంపీ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి మాట్లాడేముందు బండి సంజయ్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం అప్పులపాలవుతున్నప్పుడు ఎంపీగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ట్రిపుల్ ఆర్, మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవం వంటి కీలక ప్రాజెక్టుల గురించి కేంద్రంతో ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీశారు.
తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి నయా పైసా తేవడం లేదని.. కానీ యూపీ, గుజరాత్‌లకు లక్షల కోట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కేవలం చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతు ఉందనే కారణంతో ఏపీ, బీహార్‌లకు నిధులు ఇస్తున్నారని.. తెలంగాణకు మాత్రం అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ చిల్లర మాటలు కట్టిపెట్టి.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.