HYDRAA: స్వేచ్చ బ్యూరో: వరద కాలువలే కాకుండా, ప్రతి రోజూ రాకపోకలు సాగిస్తున్న రహదారులను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రా ప్రజావాణిలో పలువురు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఒకరిని చూసి మరొకరు ఇలా ఆక్రమణలను నిర్మించుకుంటూ పోతున్నారంటూ పేర్కొన్నారు. జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్, ఫాక్స్ సాగర్ చెరువు సమీపంలోని వెంకటాద్రి నగర్‌లో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో ప్రభుత్వ రహదారిన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ వెంకటాద్రి నగర్ హౌజింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని వారు వాపోయారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడలోని శ్రీశ్రీ విహార్‌లో వరద కాలువను ఆక్రమించినట్టు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుని నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఎల్లారెడ్డిగూడలోని జేపీ నగర్‌లో 40 అడుగుల వెడల్పు ఉండాల్సిన రోడ్డు క్రమంగా కుంచించుకుపోయి 25 అడుగులకే పరిమితమైందని స్థానికులు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. రోడ్డును ఆక్రమించి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపూర్ గ్రామంలోని చోటా కుంట చెరువు ( లేక్ ఐడీ నెంబర్ 2400/ఎన్ /0010) ఎఫ్‌టీఎల్‌ను పునఃసర్వే చేసి, హద్దులను ఖరారు చేయాలని పట్టాదారులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చెరువు పరిధిలోని డంప్ యార్డును తరలించాలని, చెరువు భూమిలో కేటాయింపులను రద్దు చేయాలని, దిగువ నాలాలు, డ్రైనేజీలపై ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా సోమవారం ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా అడిషనల్ కమిషనర్ డి. ఆనంద్‌కుమార్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అందజేశారు.
Also read: “శరణమా? మరణమా?.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక!