BB Nagar AIIMs : కొవిడ్ తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన హెచ్ఎంపీవీ కేసులు.. అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. పొరుగునే ఉన్న భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కొవిడ్ సమయంలోని అనుభవాలతో ముందస్తు జాగ్రత్తగా వైద్యారోగ్య శాఖ అనేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అనుమానిత హెచ్ఎంపీవీ కేసుల్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా తెలంగాణలోనూ హెచ్ఎంపీవీ పరీక్షలు జరిపేందుకు అవకాశం కల్పించిన కేంద్రం.. యాదాద్రి భువనగిరిలోని బీబీనగర్ ఎయిమ్స్ లో ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో హెచ్ఎంపీవీ అనుమానిత కేసులను గుర్తిస్తే బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిలోని వైరల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్ లాబోరేటరీలో పరీక్షించనున్నారు. కోవిడ్ తో పోలిస్తే హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ప్రస్తుతానికి భారత్ లో తక్కువగానే నమోదవుతున్నాయి. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య మరీ తక్కువగా ఉంది. దీంతో.. ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్ర వైద్యాధికారులు.. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రయోగశాల ఏర్పాటు కోసం కేంద్రాన్ని అభ్యర్థించారు. కాగా.. ఈ ప్రయోగశాలలో ఇప్పటి వరకు పది నమూనాలను పరీక్షించగా అన్ని నెగిటివ్ వచ్చినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి ఇటీవల దేశవ్యాప్తంగా అక్కడక్కడా నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కేసులు లేకపోవడం ఉపశమనం కలిగించే అంశమని అంటున్నారు.
హెచ్ఎంపీవీ పరీక్షల కోసం భారత వైద్య పరిశోధన మండలి – ఐసిఎంఆర్ దేశవ్యాప్తంగా 41 వైరాలజీ ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించేందుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో.. తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ అనుమానిత కేసులను బీబీనగర్ ఎయిమ్స్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వైద్యారోగ్య సూచించింది. వీఆర్డీఎల్ మోడల్ అధికారిగా డాక్టర్ రాహుల్ నారంగ నియమితులయ్యారు.
జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి ఉన్న వారందరికీ హెచ్ఎంపీవీ వైద్య పరీక్షలు చేయటం వీలయ్యే పని కాదని అధికారులు అంటున్నారు. అందుకోసమే ఇన్‌ఫ్లూయంజా, ఆర్‌ఎస్‌వీ(రెస్పిరేటరీ సింక్రిటియల్ వైరస్), సార్స్ కోవ్-2 పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే హెచ్ఎంపీవీ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అనుమానాలు ఉన్న నమూనాలను ఎయిమ్స్ తీసుకువచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో పాజిటివ్ వస్తే ఉన్నతాధికారులకు నివేదించి, బాధ్యతలకు వైద్య సహాయం అందించనున్నారు. ఈ మేరకు బీబీనగర్ ఎయిమ్స్ లో పరీక్షా కిట్లు, ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : చేతి దొంగలు, పాత నేరస్తులని ఈ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. నుమాయిష్‌లో పోలీసుల పకడ్భందీ చర్యలు