Telangana Govt: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నపటికీ, రాష్ట్రంలో పథకాల అమలుపై సీఎం అక్కడి నుండే ప్రత్యేక దృష్టి సారించారు. జనవరి 26 నుండి మూడు బృహత్తర పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరుకు ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీతాల పెంపుకు చొరవ తీసుకుంది.
తెలంగాణలో సివిల్ సప్లైలో పనిచేస్తున్న హమాలీలు ఎందరో ఉన్నారు. అలాగే స్వీపర్లు కూడ ఇక్కడ తమ విధులు నిర్వహిస్తున్నారు. మండల స్థాయి స్టాక్ పాయింట్లు, గ్రామ స్థాయి పాయింట్ల వద్ద కూడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి అందే జీతం చాలా తక్కువ. వీరి ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అది కూడ వారికిచ్చే వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు కూడ జారీ చేసింది.
సివిల్ సప్లై పరిధిలోని హమాలీలకు క్వింటాల్ కు ప్రస్తుతం రూ. 26 లు చెల్లిస్తారు. ఆ రూ. 26 లను ప్రభుత్వం రూ. 29 కి ప్రభుత్వం పెంచింది. అలాగే గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు రూ. 5000 వేతనం అందుతోంది. ప్రభుత్వం రూ. 1000 పెంచగా, ఇక నుండి రూ. 6000 వేతనం వారు అందుకోనున్నారు. అంతేకాకుండ హమాలీ డ్రెస్ కుట్టు కూలీ ఛార్జీ గతంలో రూ. 1300 ఉండగా, ప్రస్తుతం రూ. 1600 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అన్ని వర్గాల ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, అందరికీ మేలు చేకూరుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడినట్లు హమాలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని స్వీపర్స్ తెలుపుతున్నారు. ఎంతైనా ఇది ఇందిరమ్మ రాజ్యం.. ఈ రాజ్యంలో అందరి మేలు మా ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.