ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు సైతం నిత్యం బాధ్యతగా మెలగాలి. ప్రజాహితం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. సర్కారు మంచి చేస్తే వెనకేసుకురాకపోయినా పరవాలేదు. కానీ నిత్యం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదు. కానీ, ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏది చేసినా తప్పే అనేతీరుతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ప్రజలకు మంచి జరిగితే ఏంటి? మంచి జరగకపోతే మాకేంటి? మేం ప్రతిపక్షంలో కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం అదే మా కర్తవ్యం రేంజ్‌లో కొందరు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అలా ఉంటే ప్రజా హితం కోసం పనిచేసే ప్రభుత్వాలు సైతం పథకాలు, అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతాయి. ప్రజలకు పదే పదే సర్ధిచెప్పుకోవడమే సరిపోతుంటుంది.
గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎత్తిచూపింది. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నిఇబ్బందులు పడ్డారో పదేండ్లు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నవారు చూశారు.అందుకే అలాంటి తప్పులు తమ హయాంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గులాబీ బాస్ హయాంలో అభివృద్ధి పేరిట వందల కోట్ల అవినీతి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ కూతురే బయటపెడుతున్నారు. దాన్ని కూడా ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.కాళేశ్వరం నుంచి విద్యుత్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట కమీషన్లు కొల్లగొట్టారు. అందుకే ప్రజలు విసిగిపోయి ప్రభుత్వాన్ని మార్చారన్నది జగమెరిగిన సత్యం. అధికారం నుంచి తప్పించి ప్రతిపక్షం హోదా కల్పించినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని ప్రజలే మాట్లాడుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.70 వేల కోట్ల సర్‌ప్లస్‌లో ఆర్థికవ్యవస్థ ఉన్నది. అయితే,గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ పాలన పుణ్యామా అని అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.అభివృద్ధి, సంక్షేమం పేరిట కేసీఆర్ ఇష్టానుసారంగా అప్పులు తెచ్చారు. ఫలితంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెలానెలా ఆ అప్పులకు వడ్డీలు కడుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అప్పుల భారం తగ్గించాలని రేవంత్ సర్కార్ చూస్తున్నది. అందుకే గ్లోబల్ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించి రూ.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రాబట్టింది.అదేవిధంగా రేపు (శనివారం) అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఉప్పల్ మైదానంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేశారు.
ఆయనతో సీఎం రేవంత్ దేశీయ క్రీడాకారులతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు.అంతేకాకుండా ఆయన్నుతెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని సర్కారు భావిస్తున్నది. అలా చేయడం వలన రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయని సర్కార్ ఆలోచనచేసింది. ఎందుకంటే మెస్సీ గ్లోబల్ వైడ్‌గా పాపులర్. ఆయన మల్టీనేషనల్ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ నిర్వహిస్తుంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించడం సబబేనా? గత బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఈ కారు ఫార్ములా రేస్ నిర్వహించి సుమారు రూ.40కోట్లకు పైగా హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారు? దీనిపై విచారణకూడా జరుగుతోంది. కానీ, మెస్సీతో మ్యాచ్ ప్రయివేటు అని.. ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం చెప్పినా ప్రతిపక్షాలు వినిపించుకోకుండా రాద్దాంతం చేయడం ఎంతవరకు కరెక్టు?.. ప్రతిదానిలో చెడు కాకుండా మంచిని కూడా చూడాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.