ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉండొచ్చు. మరి వాటిని ఎవరు తొలగించాలి. రాజకీయ నాయకులా, అధికారులా..? ఆ బాధ్యత ఇద్దరిపై ఉంది. అప్పుడప్పుడు కొంతమంది అధికారులు ఈ విషయంలో ముందడుగు వేస్తుంటారు. అలా ఒక మంచి నిర్ణయం తీసుకున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమె తీసుకున్న చొరవ అభినందనీయమని, ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై మంచి నమ్మకాన్ని కలిగిస్తుందని ప్రశంసించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో…
ఆధునిక సదుపాయాలు,
అనుభవం ఉన్న వైద్యులు,
సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు.సర్కారు దవాఖానలో…
నాణ్యమైన వైద్య సేవలు…
అందుతాయన్న నమ్మకం…
మాత్రమే ఇప్పుడు కావాలి.
ప్రభుత్వ ఆసుపత్రిలో
శస్త్ర చికిత్స చేయించుకుని
ఆ నమ్మకాన్ని కలిగించిన…
కరీంనగర్… pic.twitter.com/JZqjQbTv7N— Revanth Reddy (@revanth_anumula) June 16, 2025
అసలేం జరిగింది..?
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి శ్వాస సంబంధమైన సమస్యలున్నాయి. కొన్నిరోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మందులు వాడుతున్నారు. అయినా కూడా సమస్య పూర్తిగా తగ్గలేదు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వైద్యుల్ని సంప్రదించడం విశేషం. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలోని ఈఎన్టీ వైద్యులు ఎల్.రవికాంత్, సందీప్, మధుమిత.. కలెక్టర్ పమేలా సత్పతికి ఆపరేషన్ చేశారు. ఎండోస్కోపీ నాసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈమేరకు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో జిల్లా స్థాయి అధికారులు కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకునేవారు. కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీకోసం వచ్చేవారు. అయితే ఓ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నాసల్ సర్జరీ చేయించుకోవడం ఇదే మొదటి సారి అని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ వార్త వైరల్ గా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించారు.
తెలంగాణ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కావాల్సిందల్లా సర్కారు దవాఖానలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమేనని చెప్పారు. ఆ నమ్మకాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలకు అందించారని అభినందించారు. “ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి నా అభినందనలు.” అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : వారెవా కరీంనగర్ కలెక్టర్.. మేడమ్ సార్ మేడమ్ అంతే..
సర్కారు దవాఖానాలు అంటే ప్రజలు వెనకడుగు వేస్తుంటారు. నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవైపు చూస్తుంటారు కానీ, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులనే ప్రిఫర్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారికి ఆదర్శనంగా నిలిచారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చొరవని అటు ప్రజలు కూడా అభినందిస్తున్నారు. వైద్య ఖర్చులకు రీఎంబర్స్ మెంట్ ఫెసిలటీ ఉన్నా కూడా ఆమె ప్రైవేట్ ఆస్పత్రుని ఎంచుకోక పోవడం ఇక్కడ విశేషం. కలెక్ట్ పమేలా సత్పతి చొరవ వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సౌకర్యాలు ప్రజలకు మరోసారి తెలిసొచ్చాయని అంటున్నారు.