Karimnagar Collector: కలెక్టర్ అంటే.. జిల్లా మొత్తానికి బాస్. ఆ బాస్ తలచుకుంటే.. జిల్లా స్వరూపాన్నే మార్చేయొచ్చు. వినూత్న కార్యక్రమాలతో తమ మార్క్ చూపిన కలెక్టర్లు ఎందరో ఉన్నారు. కానీ.. ఇటీవల కొందరు కలెక్టర్ల వ్యవహారం చూస్తుంటే.. అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చామా? కొన్నాళ్లు పనిచేశామా? ట్రాన్స్‌ఫర్ చేయగానే వెళ్లిపోయామా? అన్నట్లు తయారవుతున్నారు. కొందరు మాత్రమే తమ విభిన్న ఆలోచనలకు రూపమిచ్చి.. ఆచరణలో పెట్టి.. అద్భుతమైన ఫలితాలు సాధించి.. ప్రజల మనస్సులో నిలిచిపోతున్నారు. ఆ లిస్టులో ఒకరే.. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ఐఏఎస్ అధికారిగా జిల్లాపై ఆవిడ వేసిన ముద్ర ఏంటి?
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ.. కలెక్టర్ అంటే జిల్లాని శాసించే అధికారం మాత్రమే కాదు. ఆ జిల్లా రూపురేఖల్ని మార్చే బాధ్యత కూడా! ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు బాధ్యతగానే ఉన్నారు. ఇంకొందరు.. నామ్ కే వాస్తే అన్నట్లుగా మారారు. మరి.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. గడిచిన ఏడాదిన్నరలో జిల్లాపై చూపిన మార్క్ ఏంటి? మార్చిన రూపురేఖలేంటి?
2015లో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయిన పమేలా.. తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, ఆ తర్వాత భద్రాచలం ఆలయం ఈవోగా పనిచేశారు. భూసేకరణ శాఖలోనూ సేవలందించారు. 2019 డిసెంబర్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి.. నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత.. యాదాద్రి జిల్లా కలెక్టర్‌గానూ పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పమేలా సత్పతి కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి.. శభాష్ అనిపించుకున్నారు.
1. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పనితీరు ఎలా ఉంది?
ఎన్నికలు పూర్తయిన వెంటనే.. కలెక్టర్‌గా తాను పనిచేస్తున్న జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకు ఎలాంటి సేవలు అందిచొచ్చనే విషయాలను ఆలోచించారు పమేలా సత్పతి. ఇందుకనుగుణంగా అనేక వినూత్న కార్యక్రమాలకు ఆమె రూపకల్పన చేశారు. ముఖ్యంగా.. పేద చిన్నారుల చదువు, మహిళల ఆరోగ్యం, వైద్యం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కలెక్టర్ అంటే ఆఫీసుకే పరిమితమవడం కాదు. జనంలోకి వెళితేనే వారి అవసరాలు తెలుస్తాయ్. సమస్యలు బయటకొస్తాయి. అందుకోసమే.. పమేలా సత్పతి సర్కార్ బడులు, ఆస్పత్రులు, అంగన్ వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని నేరుగా తెలుసుకుంటారు.
గట్టుభూత్కూర్ గ్రామంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు
ప్రతి మంగళవారం ప్రభుత్వం చేపట్టిన.. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. కలెక్టర్ తనిఖీలతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వైద్య సేవల్లోనూ మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. మూతబడిన సైన్స్ మ్యూజియంపైనా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దాని ప్రక్షాళనకు నడుం బిగించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. కాలేజీల వారీగా ప్రత్యేక టీమ్‌లని ఏర్పాటు చేయించారు. ఇటుకల బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లల చదువుల కోసం గట్టుభూత్కూర్ గ్రామంలో ప్రత్యేక పాఠశాలని ఏర్పాటు చేయించారు.
2. కలెక్టర్‌గా పమేలా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి?
యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో.. తన కొడుకుని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు పమేలా సత్పతి. ఆ సమయంలో.. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో.. శుక్రవారం సభ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనిని కరీంనగర్ జిల్లాలోనూ కొనసాగిస్తున్నారు. ప్రతి శుక్రవారం.. ఏదో ఒక అంగన్‌వాడీకి వెళ్లి.. అక్కడ అందుతున్న పౌష్టికాహారం, గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తారు. కలెక్టర్ పమేలా చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం.. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంఘాల సహకారంతో.. విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ లాంటివి అందేలా చేస్తున్నారు.
నటి మంచులక్ష్మితో.. స్కూల్ పిల్లలకు సాయం
ఇటీవలే సినీ నటి మంచులక్ష్మిని కరీంనగర్‌కు రప్పించి.. స్కూల్ పిల్లలకు సాయం చేయించారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బెటరో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు.. క్రీడాకారులు, రాజనీతిజ్ఞులు, సైంటిస్టులపై వచ్చిన సినిమాలను.. శని, ఆదివారాల్లో స్టూడెంట్స్‌కు చూపిస్తున్నారు. పమేలా సత్పతి సమావేశాల్లో బిజీగా ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు.. కలెక్టరేట్ దగ్గర ప్రజలు ఆవిడ కోసం ఎదురుచూస్తూ కూర్చుకుంటున్నారు. తనని కలిసేందుకు వచ్చే ప్రజల కోసం కలెక్టర్ ఆఫీసులోనే ఓ లైబ్రరీని ఏర్పాటు చేయించారు. అందులో వందల పుస్తకాలు, న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచారు.
3. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి?
పమేలా సత్పతి తీసుకొచ్చిన శుక్రవారం సభ కార్యక్రమానికి.. మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సభకు కలెక్టర్‌తో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్యులు హాజరవుతారు. మహిళలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి.. వారి కష్టసుఖాలను పంచుకునేందుకు ఇదో వేదికగా నిలుస్తోంది. కుటుంబంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటేనే.. సమాజం బాగుంటుందనేది ఈ శుక్రవారం సభ ముఖ్య ఉద్దేశం. ఇక మధ్యలోనే చదువు ఆపేసిన వారిలో.. మానసిక స్థైర్యాన్ని నింపేలా మరో పని చేశారు. గడిచిన నాలుగైదేళ్లలో పదో తరగతి ఫెయిలైన వారి వివరాలు సేకరించి.. వారు ఏయే సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారో గుర్తించి.. వాళ్లందరికీ పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రత్యేక క్లాసులు చెప్పించి పరీక్షలు రాయించారు. వారిలో దాదాపు 400 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇది.. వాళ్లందరినీ ఉన్నత చదువుల వైపు మళ్లించింది. ఇటీవలే.. బాలసదన్‌లో పెరిగిన మౌనిక అనే అనాధ అమ్మాయికి.. ఐసీడీఎస్ అధికారుల సహకారంతో.. ప్రభుత్వమే పెళ్లి పెద్దగా మారి వివాహం జరిపించింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నేతల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూస్తున్నారు.
5. ఫైల్స్ క్లియరెన్స్ ఎలా ఉంది?
ఓ వైపు ప్రజా సంక్షేమం, జనం సమస్యలపై దృష్టి పెడుతూనే.. అభివృద్ధి కార్యక్రమాలపైనా ఫోకస్ చేస్తున్నారు కలెక్టర్ పమేలా సత్పతి. అయితే.. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు.. వేగంగా అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతోందనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఎందరో అర్హులైన పేదలకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదనే చర్చ జరుగుతోంది. వాళ్లందరినీ గుర్తించి పథకాలు అందేలా చూడాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులపైనా దృష్టి పెడితే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ పమేలా సత్పతి.. తన పనేదో తను చేసుకొని.. ఇంటికెళ్లే రకం కాదు. ఓవైపు ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడటం, మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టి.. జిల్లా రూపురేఖల్ని మార్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో.. తన కలల ప్రాజెక్టులను కొన్నింటిని ఆమె ఆచరణలోకి తీసుకొచ్చారు. వినూత్న ఆలోచనలను ఆచరణలో పెడుతూ, సరికొత్త కార్యక్రమాలను మందుకు తీసుకెళ్తూ, జిల్లాను అభివృద్ధిపథంలో నడిపేందుకు, సమర్థవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నారనే టాక్ ప్రజల్లో ఉంది. అందుకోసమే.. బిగ్ టీవీ సర్వేలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి మంచి మార్కులు పడ్డాయి.