CM Revanth Reddy: కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు చేసిన అన్యానికి ఉరి తీసినా తప్పులేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీరద్దరూ దుర్మార్గులన్నారు. వీళ్లు చేసిన తప్పుకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్యాన్ని సమర్థించకపోయినా పర్లేదు. కానీ, సంకుచిత స్వభావంతో ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు” అని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం సృష్టించి, దాంతో లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి వాటాలపై చర్చల నేపథ్యంలో ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాభవన్‌లో ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.
నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచేదన్నారు. నీళ్ల వాటా కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ సొంత ప్రభుత్వాన్నే నిలదీశారని గుర్తుచేశారు. గత పదేళ్లలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయన్నారు. వాటన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
Also Read: బీఆర్ఎస్ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనతో కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని పదేళ్ల సమయానికి కేసీఆర్ సంతకం చేశారు. కేసీఆర్ పెట్టిన సంతకం వల్ల ఆంధ్రప్రదేశ్ కు అడ్వాంటేజ్‌గా మారింది. అప్పుడు ఏపీకి 66శాతం, తెలంగాణకు 34 శాతం నీటి వాటాలకు కేసీఆర్ ఒప్పుకున్నారు. దీంతో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు రాకుండా వాయిదా పడింది. నదీ పరివాహక పరిధి చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం రావాల్సి ఉందన్నారు.