E-Paper
Advertisement

Kurnool District: ఎమ్మిగనూరు.. వైసీపీలో మూడుముక్కలాట

Kurnool District: ఎమ్మిగనూరు.. వైసీపీలో మూడుముక్కలాట
Advertisement

Kurnool District: వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ తన సొంత ఇలాకా ఆయిన రాయలసీమపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు… ప్రత్యర్థులకు గట్టి గుణపాఠం చెప్పాలంటే మొదట సొంత ఇల్లు చక్కబెట్టుకుని రచ్చకెక్కాలని జగన్ రెడీ అవుతున్నారట. ముందుగా రాయల సీమలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితుల్ని సరిదిద్దే పనిలో ఉన్నారట. ఆ క్రమంలోనే ఎమ్మిగనూరు ఇన్చార్జ్ మార్పు అంటున్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న బుట్టా రేణుకని తప్పించి, రాజీవ్ రెడ్డిని నియమించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. రేణుకకి కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. బుట్టా రేణుకను ఎమ్మిగనూరు నుంచి పంపించేయడంపై లోకల్‌గా అసంతృప్తి రాజుకుంటుండటంతో.. అక్కడ వైసీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందట. మరోవైపు సీనియర్లను కాదని రాజీవ్‌రెడ్డినే కొనసాగిస్తే రెబల్‌గా ముందుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి అల్టిమేటం జారి చేశారు … దాంతో అక్కడ వైసీపీలో మూడు ముక్కలాట మోదలైందంటున్నారు.

రాయలసీమ జిల్లాల్లో పార్టీని చక్కదిద్దే పనిలో జగన్

ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ ఛార్జ్‌గా బుట్టా రేణుక తొలగింపునకు ప్రధాన కారణం ఏంటి? అంటే అనేక కారణాలు ఉన్నట్టు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా టైమ్ ఉండగానే ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఆ క్రమంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న బుట్టా రేణుకను తప్పించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. సేమ్ టైమ్ బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది.

వైసీపీ–టీడీపీ మధ్య బుట్టా రేణుక రాజకీయ గమనం

Advertisement

బుట్టా రేణుక 2014 లో కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. 2018 టైమ్‌లో ఆమె వైసిపిని పార్టీని వీడి అధికారంలో ఉన్న టిడిపిలో చేరారు… మరోసారి తిరిగి ఎన్నికల సమయంలో సొంతగూడు వైసీపీలోకి వచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆమెకు జగన్ టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన ఎన్నికలలో వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ కు అవకాశం కల్పించింది.. మాజీ ఎంపీ బుట్టా రేణుక చేసేదేం లేక వైసీపీ అభ్యర్ధులను సపోర్ట్ చేస్తూ వచ్చారు.. 2024 ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఆమెను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశమిచ్చింది. అక్కడ పరాజయం పాలైన ఆమె మొన్నటి దాకా ఎమ్మిగనూరు ఇన్‌చార్జిగా పని చేస్తూ వచ్చారు.

ఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరు

అయితే ఎమ్మిగనూరులో గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం ఒకవైపు మరోవైపు బుట్టా రేణుక వర్గం పార్టీని రెండుగా విభజించి రోడ్డున పడేశారని అధిష్టానానికి రిపోర్టులందాయట. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో.. బుట్టా రేణుకను కర్నూలు లోక్‌వసభ సెగ్మెంట్ ఇన్చార్జ్‌గా పంపారంట. చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికే ఎమ్మిగనూరు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో వ్యవహారం సెట్టైనట్లే అని వైసీపీ హైకమాండ్ భావించిందంట. అయిత బుట్టా రేణుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని అనుకుంటున్నారని ప్రచారంలో ఉంది. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారట.

బుట్టా రేణుక రీఎంట్రీ, బీవై రామయ్య భవితవ్యం ఏంటి?

Advertisement

అయితే వైసీపీ అధిష్టానం బుట్టా రేణుకను మళ్ళీ ఎంపి సెగ్మెంట్ ఇన్చార్జ్‌గా పంపించడంతో ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు 2024లో కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బీ వై రామయ్యకు ఎక్కడ అవకాశం ఇస్తారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది కర్నూలు మేయర్‌గా కొనసాగుతున్న బివై రామయ్య పదవి కాలం కూడా ముగుస్తుండటంతో ఆయనకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్న ఉత్కంఠ బి వై రామయ్య అనుచరులలో మొదలైందట… మొత్తానికి వైసీపీకి పట్టున్న కర్నూలు జిల్లాలో వర్గ పోరుకు కేరాఫ్ గా మారడం పార్టీ అనుచరుల్లో కలవరం రేపుతోందట.

ఎమ్మిగనూరు వైసీపీ టెన్షన్

ఎమ్మిగనూరు, వైసీపీ ఇన్చార్జ్‌గా బుట్టా రేణుక తొలగింపుతో నియోజకవర్గంలో ముసలం మొదలైందట. బుట్టా అనుచరులంతా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్‌రెడ్డిని నియోజక వర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎర్రకోట రాజీవ్‌రెడ్డిని నియోజక వర్గ ఇన్ఛార్జిగా పెట్టడంపై వైసీపీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందట. దీంతో భవిష్యత్ కార్యాచారణపై బుట్టా వర్గం దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

ఎర్రకోట కేశవ రెడ్డి పంతం నెగ్గిందా?

చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వలేదు. తన కొడుకు జగన్ మోహన్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని అడిగినా గతంలో ఓడిపోవడంతో అధిష్టానం నిరాకరించింది. బుట్టా రేణుక సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో ఎమ్మిగనూరు నుంచి ఆమెను బరిలోకి దించింది. అయితే గ్రూప్ తగాదాలతోనే తమ నాయకురాలు ఓడిపోయినట్లు బుట్టా రేణుక వర్గం అప్పట్లో ఆరోపించింది. ఆ క్రమంలో నియోజక వర్గ ఇన్ఛార్జి పదవి కోసం పార్టీలో కొంతకాలంగా గట్టి పోటీ నెలకొన్నప్పటికీ అధిష్టానం మాత్రం రాజీవ్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. దీంతో సీనియర్ నేత ఎర్రకోట కేశవ రెడ్డి పంతం నెగ్గిందన్న టాక్ వినిపిస్తోంది.

కేశవరెడ్డి అసంతృప్తితో బుట్టా రేణుక అవుట్‌

రాజీవ్‌రెడ్డి నియామకం ద్వారా యువతను ఆకట్టుకోవడంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలో పట్టును పెంచుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మిగనూరు ఇన్‌చార్జ్‌గా బుట్టా రేణుకను ప్రకటించిన జగన్ మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించినా బుట్టా రేణుక ఆచరణలో పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే క్యాడర్‌ తమకు బుట్టా రేణుక విలువ ఇవ్వడంలేదని కేశవ రెడ్డి దగ్గర వాపోతున్నట్లు తెలిసింది. దాంతో నియోజకవర్గంలో ఃపట్టున్న కేశవరెడ్డి స్వయంగా జగన్ దగ్గరికి వెళ్లి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టడంతో బుట్టా రేణుకను తొలగించారంట.

రాజీవ్ రెడ్డి ఎంట్రీతో వైసీపీకి కొత్త తలనొప్పి

ఏదేమైనా వైసీపీ మరోసారి ఇన్చార్జిలను మారుస్తుండటం బుట్టా వర్గంలో మరోసారి కలవరం రేకెత్తిస్తుందట. బుట్టా అనుచరులు కొత్తగా వచ్చిన యువ నాయకుడి రాజీవ్ రెడ్డికి సపోర్ట్ చేసేదేలే అంటూ అల్టిమేటం జారీ చేసుకుంటున్నారట… మరోవైపు మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణి రెడ్డి కూడా వైసీపీలో ఉన్న సీనియర్లను కాదని రాజీవ్‌రెడ్డికి సీటు ఇస్తే రెబల్‌గా పోటీకి సిద్దమంటున్నారంట.. ఈ వ్యవహారం కాస్తా వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పి మారిందట. మొత్తమ్మీద రానున్న రోజుల్లో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

Story by Ajay, Big Tv

Related News

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

Big Stories

Advertisement
×