GHMC : హైదరాబాద్ మహానగరం. విశ్వనగరం. గ్రేటర్ సిటీ. చెప్పుకోవడానికి ఇవన్నీ బానే ఉన్నా.. ఓ గట్టి వాన పడితే తెలుస్తుంది ఈ నగరం గొప్పతనం ఏంటో. పట్టుమని 10 నిమిషాల వర్షానికే భాగ్యనగరం మునిగిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో నరకం చూపిస్తుంది. పడిన వాన నీరు ఎటూ పోలేదు. ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువులు అవుతాయి. డ్రైనేజీ నీరు పొంగి బయటకు వస్తుంది. ఆ మురుగు నీరంతా వాన నీటితో మిక్స్ అవుతుంది. నిమిషాల గ్యాప్‌లోనే నగరమంతా గబ్బు గబ్బు అవుతుంది. వాన పడిన ప్రతీసారీ ఇదే తంతు.
ఈ నగరానికి ఏమైంది? ఆ పాపం ఎవరిది?
ఇలా ఒకటీ రెండు సార్లు కాదు.దశాబ్దాల తరబడి ఇదే దుస్థితి. ఎప్పుడో నిజాంల కాలంలో కట్టిన డ్రైనేజీ సిస్టమ్. ఇప్పటికీ అదే ఆదుకుంటోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా పట్టించుకోలేదు అప్పటి సీఎం కేసీఆర్. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారే కానీ.. వాన పడితే తెలిసొస్తుంది ఈ నగరానికి ఏమైంది? అనేది. గచ్చిబౌలి జంక్షన్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎల్బీ నగర్ నుంచి పటాన్‌చెరువు వరకు.. ఉప్పల్ నుంచి శంషాబాద్ వరకు.. సిటీ అంతా అధ్వాన్నమే. హైదరాబాద్ మురుగు నీరు పారుదల కోసం నయా పైసా ఖర్చు పెట్టలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే, మూడు రోజుల క్రితం కురిసిన వానకు.. మరోసారి మహానగరం నిండా మునిగింది. ఇలా అయితే కుదరదని తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్‌పై సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎమ్‌సీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆర్డర్స్‌కు గ్రేటర్ కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
వానా కాలం అలర్ట్.. పనులు స్పీడప్
గ్రేటర్ హైదరాబాద్‌లో వరద ముంపును అరికట్టేందుకు GHMC సిద్ధమైంది. వర్షపు నీరు ఫ్లో అయ్యే స్ట్రీమ్ వాటర్ డ్రైన్ మాస్టర్ ప్లాన్‌కు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్‌పై స్టడీ కొనసాగుతోంది. వచ్చే వర్షాకాలం నాటికి పట్టణ ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది GHMC.
రంగంలోకి GHMC కమిషనర్
గత వర్షాకాలంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా చర్యలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో 5 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ పూర్తి కాగా, మిగతా వాటిని త్వరగా పూర్తి చెయ్యాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్‌లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను తగ్గించేందుకు పనులు చెయ్యాలని, నిధులు కావాలంటే ఇస్తామని హామీ ఇచ్చారు GHMC కమిషనర్ ఇలంబర్తి.
రోడ్డు పక్కనే పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు
ఇదీ మేటర్. వాన నీరు ఎక్కడెక్కడ భారీగా నిల్వ ఉంటుందో ఆ ఏరియాలను ఇప్పటికే గుర్తించారు. అక్కడ వాటర్ జామ్ అవడం వల్లే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని తేల్చారు. పురాతన డ్రైనేజీని ఇప్పటికిప్పుడు మార్చడం కుదరకపోవచ్చు. అది చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే, ఎక్కడైతే వర్షపు నీరు నిల్వ ఉంటుందో.. ఆ నీటిని అక్కడే వడిసి పట్టి.. భూమిలో స్టోర్ చేసేలా పెద్ద పెద్ద సంప్‌లు కడుతున్నారు. ఆ పనులు వేగవంతం చేయాలని.. వానా కాలం వచ్చేలోగా కంప్లీట్ అయ్యేలా పర్యవేక్షిస్తున్నారు GHMC కమిషనర్.