Indiramma Housing scheme : తెలంగాణలోని నిరుపేదలకు ప్రభుత్వం నిత్యం అండగా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. అత్యంత పేదలకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాథాన్యత ఇస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన కసరత్తు విషయమై తన నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అనేక విషయాలు చర్చించగా.. అధికారులకు పలు సూచనలు చేశారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆశయాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్రామాల్లోని దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పేదల్లోనూ ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి ఇళ్లు మంజూరు చేయాలని సమావేశంలో సూచించారు.
రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి.. తొలి దశలో సొంత ఇంటి స్థలాలున్న వారికే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హుల ఎంపిక, ఇళ్ల మంజూరు విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.
లబ్దిదారుల ఎంపిక సహా ఈ పథకానికి సంబంధించిన అన్ని విషయాలు పొందుపరిచేందుకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని.. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని సూచనలు చేశారు. సాంకేతిక సమస్యలే కాకుండా.. శాఖాపరమైన పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దని సీఎం ఆదేశించారు.
ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే.. అధికారులు అడ్డు చెప్పవద్దని అలాంటి వారికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. వారికి పెరగనున్న జీతాలు
రాష్ట్రంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా భరోసా కల్పించాలని భావిస్తున్న రేవంత్ సర్కార్.. నియోజకవర్గాల వారీగా తొలిదశలో కొన్ని ఇళ్లను మంజూరు చేయనుంది. అనంతరం క్రమంగా.. లబ్ధిదారుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే.. గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న కుల గణన సర్వేలోనే నిరుపేదల వివరాలు ప్రభుత్వానికి తెలియనున్నాయి. వాటితో పాటు గ్రామ స్థాయిలో నియమించనున్న ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల తీర్మాణాలు ఇలా పలు విధానాల్లో ఒడపోత చేసి లబ్దిదారుల్ని ఎంపిక చేయనున్నారు.