IR Increase : రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే ఏడాది పరిపాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా మధ్యంతర భృతి – ఐఆర్ (ఇంటీరిమ్ రిలీఫ్) ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల్లోని వేలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న మూలధన వేతనంపై 5 శాతం మధ్యంతర భృతి మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఈ రంగంలోని ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుకోనున్నారు.
క్రితం ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర భృతిని పెంచింది. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆ నిర్ణయంతో లబ్ధి పొందారు. కాగా.. వారికి సైతం అప్పట్లో 5 శాతమే మధ్యంతర భృతిని అందించారు. ఇప్పుడు.. ప్రజా విజయోత్సవాల నేపథ్యంలో మిగతా ఉద్యోగుల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అందరికీ మేలైన నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సైతం మధ్యంతర భృతిని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : కేటీఆర్ నువ్వు జైలుకే.. తొందరెందుకు వెయిట్ అండ్ సీ.. మంత్రి సురేఖ కామెంట్స్
ఈ నిర్ణయంతో యూనివర్శిటీ, కాలేజీల్లో పని చేస్తున్న వేలాది మంది అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. అలానే.. కో ఆపరేటివ్ సొసైటీల్లో పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాలు సైతం పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఉద్యోగ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో చేస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుని నూతన ఏడాదిలో శుభవార్త అందించారని ఆనందపడుతున్నారు. ఏడాది పాలన తర్వాత నిజంగానే గుడ్ న్యూస్ చెప్పారంటూ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.