CM Revanth Reddy: తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తాజాగా ముఖ్యమంత్రి జపాన్ టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయ్యింది. ఏప్రిల్ 15 నుంచి అక్కడ పర్యటించనున్నారు.
తొలుత జపాన్
పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ టూర్ ఓకే అయ్యింది. ఏప్రిల్ 15 నుంచి 23 వరకు ఒకాసా ఎక్స్‌పో-2025 హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర అధికారులు వెళ్తున్నారు. జపాన్ పర్యటన విజయవంతం చేయడంపై దృష్టి పెట్టారు అధికారులు.
సీఎం బృందం ఏయే కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యే ప్రణాళికను పరిశ్రమల శాఖ రెడీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జపాన్ లోని ఫేమస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఒప్పందాలపై చర్చించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జపాన్ పర్యటన తర్వాత జూన్ లేదా జులైలో అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి పెట్టుబడులను ఆహ్వానించడానికి అధికారుల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.
జూన్ లేదా జులైలో అమెరికా
దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉండనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితో పాటు పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటులో సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే అవకాశం ఉంది.
ALSO READ: సిఫారసు లేఖలు.. ఆపై ప్రత్యేక వెబ్‌సైట్
మరోవైపు ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పో-2025లో సీఎం రేవంత్ టీమ్ పాల్గొంటుంది. తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కంపెనీలు ముందుకొస్తున్న విషయాన్ని ఎక్స్‌పో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ఏడాది దావోస్ పర్యటనలో పలు కంపెనీల పెట్టుబడులను తెలంగాణకు ఆహ్వానించారు ముఖ్యమంత్రి.
ఈసారి జపాన్ టూర్ వల్ల రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి పెరగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా డీ లిమిటేషన్‌పై హైదరాబాద్‌లో రెండో సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సమావేశానికి తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడి జపాన్ టూర్‌కి వెళ్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు వెళ్లారు సీఎం రేవంత్. ఆయా కంపెనీలు ప్రతినిధులు సైతం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెల్సిందే.
భద్రాచలంలో సీఎం
ఇదిలా ఉండగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొంటారు సిఎం రేవంత్ రెడ్డి. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి దంపతులు. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ కూడా హాజరుకానున్నారు.