Tirumala News: గోవింద.. గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగుతాయి. ఒక్కసారి శ్రీవారిని దర్శించుకుంటే కష్టాలు తగ్గి.. కాసింత ఉపశమనం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎన్ని కష్టాలు పడైనా ఏడాదికి ఒక్కసారైనా తిరుమలకు వెళ్తుంటారు భక్తులు. అక్కడ రోజురోజుకూ రద్దీ క్రమంగా పెరుగుతోంది.
ఒకప్పుడు వీకెండ్ మాత్రమే రద్దీగా ఉండేది. ఇప్పుడు వారమంతా కొండపై అలాగే ఉంది. కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. ఇటీవల టీటీడీపై రివ్యూ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 20 ఏళ్లను దృష్టి పెట్టుకుని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన చేశారు.
కనీసం ఒక్కరోజైనా తిరుమలలో గడపాలని చాలామంది భక్తులు భావిస్తుంటారు. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్ లభిస్తే.. వసతి దొరకని పరిస్థితి ఏర్పడింది. మూడు రోజుల కిందట రూ. 300 దర్శనానికి వెళ్లినవారికి నాలుగైదు గంటలు పట్టిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం సిఫార్సు లేఖలను ఆన్‌లైన్‌లో పంపించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రెడీ చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. తెలంగాణ నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వెళ్తుంటారు. ఒకప్పుడు లేఖలు టీటీడీకి పంపేవారు. అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత వెళ్లేవారు.
ALSO READ: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిలే చేస్తే కార్డు కట్!
ఇప్పుడు అలా కాకుండా సిఫార్సు లేఖల్ని https://cmottd.telangana.gov.in లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. దర్శనం కోసం ఇచ్చే లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మార్గ దర్శకాలతో కూడిన లేఖలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం ఓఎస్డీ శుక్రవారం పంపించారు.
సీఎం కార్యాలయం రూపొందించిన పోర్టల్ నుంచి భక్తులు, దర్శన వివరాలతో జనరేట్ చేసిన లేఖలను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసిన లేఖను టీటీడీకి అప్‌లోడ్ చేసి అసలు లెటర్ భక్తులకు ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు సీఎం ఓఎస్డీ సూచన చేశారు.
సీఎంఆర్‌ఎఫ్ కోసం ఉపయోగించే లాగిన్ వివరాలను టీటీడీ దర్శనం పోర్టల్‌కు వినియోగించాలని తెలిపారు. అయితే ఈ విధానం తీసుకురావడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. తమ కోటాకు మించి సిఫార్సు లేఖలు ప్రజా ప్రతినిధులు ఇస్తున్నట్లు సమాచారం. తిరుమలకు వెళ్లిన భక్తులు ఇబ్బంది పడటం వంటి అనుభవాల నేపథ్యంలో ఆన్‌లైన్ పద్దతిని తీసుకొచ్చిందని అధికారుల మాట.
ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే జారీ చేయాలి. అంటే ఒక రోజుకు ఒక లేఖ మాత్రమే ఇవ్వాలన్నమాట. సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం ఉండనుంది. వీటితోపాటు వసతి సౌకర్యం ఇవ్వనుంది. బుధ, గురువారాల్లో రూ.300 దర్శనం ఉంటుంది గానీ, వసతి సౌకర్యం ఉండదు. భక్తులు ఒరిజినల్ లెటర్‌తో అక్కడకు వెళ్లాలి. ఆధార్ కార్డు లేని చిన్న పిల్లలుంటే బర్త్ సర్టిఫికెట్‌తో వెళ్లాలని ఆ లేఖలో సీఎంఓ సూచించింది.
సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తుకు ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ పోర్టల్‌లో లాగిన్ కావచ్చు. పోర్టల్‌లో నమోదు కాని లేఖలను టీటీడీ అంగీకరించదు. అప్‌లోడ్ చేసిన లేఖలు టీటీడీ లైజనింగ్ అధికారికి, లేఖ పొందిన భక్తులకు వాట్సాప్‌లో సమాచారం రానుంది.