Education Week Telangana: హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో ‘విద్యా వారోత్సవాల’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోటి 34 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు రూ.1700 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను సేకరించి ఎడ్యుకేషన్ హబ్‌లను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఉరికించిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షను ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావడంలో విద్యార్థుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం అంటే సమాజాన్ని బలహీనపరచడమేనని.. అక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. పేదలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ ఉపాధ్యాయులకు ప్రపంచ స్థాయి విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు విదేశీ పర్యటనలకు పంపిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 25 మందిని ఫిన్లాండ్‌కు పంపించామని.. త్వరలో వియత్నాం, జపాన్, సింగపూర్ దేశాలకు మరికొందరిని పంపిస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏటా 500 మంది టీచర్లను విదేశాలకు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నేర్చుకున్న నైపుణ్యాన్ని మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 11వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి రికార్డు సమయంలో నియామకాలు పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వారికి హోదాను పెంచామన్నారు. ఉపాధ్యాయులను అగ్నితో పోల్చేవారు కానీ.. తాము వారిని కుటుంబ సభ్యులుగా భావించి సమస్యలను పరిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యా సంస్కరణల్లో భాగంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా కమిషన్ సూచనలతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు దూరం కాకుండా ఉండేందుకు ఇంటర్మీడియట్‌ను కూడా పాఠశాల విద్యతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో 38 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మందే ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యాశాఖకు నిధులను క్రమంగా 15 శాతానికి పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.1100కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్‌ను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి బలవర్ధకమైన పోషకాహారాన్ని పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Read Also: BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ