ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్న రేవంత్ ప్రభుత్వం ఈ వారం కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. ధాన్యం కొనుగోళ్ల దగ్గరి నుంచి మైనార్టీల సంక్షేమం దాకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి సీఎం స్వయంగా నియామక పత్రాలు అందించారు. గత 11 నెలల్లో తెలంగాణ ఏం పొందిందో గుర్తు చేశారు సీఎం రేవంత్.
ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటిదాకా వెనుకబడ్డ జిల్లా ఏదంటే అందరూ చెప్పేది మహబూబ్ నగర్ జిల్లా గురించే. అయితే ఇప్పుడు అదే పాలమూరు నుంచి సీఎంగా రేవంత్ రావడంతో రూపురేఖలు మార్చేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు. గత పదేళ్లుగా, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించే పనికి తానే స్వయంగా బాధ్యత తీసుకున్నారు సీఎం రేవంత్. ఈనెల 10న చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 110 కోట్ల రూపాయలతో కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాలమూరుకు గతంలో అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని, కానీ కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాకు పరిశ్రమలు, ప్రాజెక్టులూ రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రుణం తీర్చుకుంటానని, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకువస్తామన్నారు. గ్రామాలకు, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదే అని, బీటీ రోడ్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలన్నారు. (స్పాట్)
10-11-2024: టీజీపీఎస్సీ స్వరూపం మార్చేందుకు శ్రీకారం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకప్పుడు లీకులు, సరైన సిబ్బంది లేక ఇబ్బందులతో కనిపించేది. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం టీజీపీఎస్సీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ చేశారు. కొన్ని భర్తీలను ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై, మరికొన్నింటిని ప్రత్యక్ష నియామకం కింద ప్రభుత్వం అనుమతించింది. టీజీపీఎస్సీ బలోపేతం కోసం కమిషన్ ప్రత్యేకంగా ఇటీవలే ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ లోతైన స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రకారం టీజీపీఎస్సీలోనూ యూపీఎస్సీ తరహా పరిపాలన, పరీక్షల నిర్వహణ విభాగాలు ఉండేలా చర్యలు సూచించింది. నిజానికి కమిషన్‌లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. టీజీపీఎస్సీలో 150 మంది పనిచేస్తుంటే అందులో 50 మంది వరకు ఫోర్త్ క్లాస్ ఉద్యోగులే ఉన్నారు. దీంతో కొత్తగా 142 పోస్టులు మంజూరు చేసింది. అదనపు పోస్టులతో కలిపి టీజీపీఎస్సీలో సిబ్బంది సంఖ్య దాదాపు 300కు చేరనుంది. కొత్తగా మంజూరైన పోస్టుల్లో 16 పోస్టులు పోలీసు అధికారులతో భర్తీ చేస్తారు. పరీక్షల ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు, ఇతర మైక్రో అబ్జర్వేషన్ బాధ్యతలను పోలీసులు నిర్ణయిస్తారు. ప్రత్యక్ష నియామకం కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్, ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులను కమిషన్ భర్తీ చేయనుంది.
11-11-2024: నియామకాల జాతర
చెప్పినట్లుగానే రేవంత్ ప్రభుత్వం నియామకాల జాతర కొనసాగిస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. రవాణా శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ పోస్టులకు ఎంపికైన వారికి ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. 113 పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. దీంతో రవాణాశాఖలో సిబ్బంది కొరత ఎక్కువైంది. దీంతో అపాయింట్ మెంట్ లెటర్లు అందించారు. ఆ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ గత ప్రభుత్వ పెద్దలు వాళ్ల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్నారు. గత 10 నెలల్లో కేసీఆర్ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, ఉచిత కరెంట్, 500 కే సిలిండర్ అందుతున్నాయని గుర్తు చేశారు.
11-11-2024: మైనార్టీ సంక్షేమానికి పెద్ద పీట
మెజారిటీ, మైనారిటీ ప్రజలు ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్నారు సీఎం రేవంత్. ఈనెల 11న రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ దగ్గర రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారన్నారు. మైనారిటీలకు తమ ప్రభుత్వం అనేక పదవులు ఇచ్చిందని నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనారిటీలకు ఇచ్చామని గుర్తు చేశారు.
11-11-2024: రైతులను మోసం చేస్తే ఎస్మా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఈనెల 11న ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు సీఎం దృష్టికి రాగానే ఆదేశాలు జారీ చేశారు. రైతుల పంట కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే సహించేంది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
11-11-2024: చిన్న సినిమాలకు సపోర్ట్
తెలంగాణలో చిత్ర పరిశ్రమని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇందుకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి చెందినవారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి చిన్న సినిమా బృందానికీ సహకారం అందిస్తున్నామని గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమ ఐదారుగురు పెద్దలదే కాదు, ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదీ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
11-11-2024: డ్రగ్స్ నివారణ సామాజిక బాధ్యత
డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దొరికిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. నిఘా పెంచారు. ఈనెల 11న ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. యువత, డాక్టర్లు, ఇంజినీర్లు సైతం డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వారిని శిక్షించేందుకు సీఎంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, అయినా సరిపోవడం లేదని, వీటి నిర్మూలనకు ఇక దైవ ఆశీర్వాదమే కావాలన్నారు. డ్రగ్స్ వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేయాలని, సామాజిక బాధ్యతగా సందేశాల్లో దీన్ని ప్రస్తావించాలన్నారు.
12-11-2024: తిరుమలలో ఇక ఆ సమస్య ఉండదు
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అంటే భక్తులకు పెద్ద సెంటిమెంట్. అయితే తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధుల సిఫార్సులు తీసుకెళ్లే వారికి పెద్దగా అవకాశం దొరకడం లేదు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా దర్శనాలకు రూట్ క్లియర్ చేసేలా కార్యాచరణ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానాల దర్శనార్థం తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే లేఖలను ఆమోదించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీటీడీ ఛైర్మన్ బీఆర్‌నాయుడును ప్రత్యేకంగా కోరారు. శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులందరికీ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
13-11-2024: నాలుగు ఫ్యూచర్ ప్లాన్స్
తెలంగాణ అభివృద్ధి గురించి సీఎం రేవంత్ పూర్తి విజన్ తో ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తాము పెట్టుకున్న లక్ష్యాలు తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం… నాలుగు భవిష్యత్ లక్ష్యాల గురించి చెప్పారు. అందులో ఒకటి ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్ వంటివి పూర్తి చేసి తీరుతామన్నారు.
14-11-2024: పెట్టుబడుల జాతర
రేవంత్ సీఎంగా పగ్గాలు చేపట్టాక అటు అమెరికా, సౌత్ కొరియా పర్యటనలు చేపట్టారు. పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన ఈ పర్యటనలు ఏడాదిలోపే సత్ఫలితాలు ఇచ్చాయి. అందుకు నిదర్శనంగా భారీగా వచ్చిన పెట్టుబడులే. లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 141 కంపెనీలు 35 వేల 820 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో 51వేల మందికి ప్రత్యక్షంగా, లక్షన్నర మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు అతి త్వరలోనే లైఫ్ సైన్సెస్ నూతన విధానాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన 141 కంపెనీల్లో కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టగా.. మరికొన్ని ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువైంది. అంతే కాదు.. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఉద్దేశంతో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమ్మిట్స్ నిర్వహిస్తున్నారు. హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో ఏఐ ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈనెల 18న రాష్ట్ర ప్రభుత్వ ఏఐ ఇన్ హెల్త్‌కేర్ సమ్మిట్ నిర్వహించబోతోంది.
14-11-2024: సీఎం ఆలోచన సూపర్
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా SCERTలో పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలను అభినందిస్తూనే.. 21 ఏళ్లకే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేలా వయసు కుదించాలని సూచన చేశారు.
14-11-2024: గురుకులాలపై స్పెషల్ నజర్
సాధారణంగా ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలు అంటే పురుగుల అన్నం, నీళ్ల చారు, ఫుడ్ పాయిజన్ ఇవే సమస్యలు వస్తుంటాయి. అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకోబోమని స్పష్టం చేస్తోంది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుకుల్లో చదువుకునే విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని, దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు వారానికి రెండుసార్లైనా ప్రభుత్వ హాస్టల్స్ లో పర్యటించాలన్నారు.
14-11-2024: కొలువుల జాతర
ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టడం, ఫలితాలు ప్రకటించడం, ఆ వెంటే నియామకాలు చేపట్టడం.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కనిపిస్తున్న మార్పు. గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు రిలీజై.. రిజల్ట్స్ రాక, నియామకాలు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలకు తాజా ప్రభుత్వం చెక్ పెడుతోంది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన తుది జాబితాను రిలీజ్ చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్‌లో భాగంగా 8,180 పోస్టులకు గాను 9లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
15-11-2024: సిటీకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం చూసి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్లస్ అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ సెమీకండక్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి ముందుకువచ్చింది. ఈమేరకు ఆ కంపెనీ సీఈఓ టీమ్ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో ఈనెల 15న భేటీ అయింది. పలు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నట్లు అలెగ్రో ప్రతినిధులు మంత్రికి వివరించారు. అలెగ్రో పరిశోధనాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Also Read: అక్రమ ఫామ్‌హౌజ్‌లకు కేరాఫ్‌గా కల్వకుంట్ల ఫ్యామిలీ.. బయటపడిన గుట్టు?
15-11-2024: ప్రజా పాలన విజయోత్సవాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శాఖల వారీగా నివేదికలు ఇచ్చేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ 12 నెలల్లో ఏం జరిగిందో ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న వరంగల్‌లో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడుతారు. స్వయం సహాయ బృందాల మహిళలతో సమావేశమై ఆ గ్రూపులకు సంబంధించిన ఆస్తుల పంపిణీ చేస్తారు.