Congress Satires On Bjp: బీజేపీ నేతలు శనివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ నిద్రలో పాల్గొన్నారు. మొత్తం 21 ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేశారు. ఉదయం లేచి అక్కడి ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం పాల్గొన్నారు. మూసీని సుందరీకరించాలని కానీ అక్కడ ఇండ్లను కూల్చివేయవద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈటల రాజేందర్ న్యూమారుతీ నగర్, సత్య నగర్ కాలనీల్లో ఉదయం పర్యటించి బాధితుల కష్టాలను తెలుసుకున్నారు.
మరోవైపు మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఒక్కరోజు నిద్రతో మూసీ బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు మూడు నెలల పాటూ మూసీ పరివాహక ప్రాంతాల్లోనే ఉండాలని చెబుతున్నారు. మూసీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ నేతలు మూసీ నిద్ర చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయలబ్ది కోసమే బీజేపీ ఇలాంటి దొంగ నిద్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డిది దొంగ దీక్ష అని మండిపడ్డారు.
వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలు మూసీ కంపులోనే మురిగి పోవాలా అని ప్రశ్నించారు. ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా ఆ ప్రాంతాల్లో నిద్రపోవాలని చెప్పారు. బీజేపీ దుకాణం బంద్ అయ్యిందనే ఇలా దొంగ దీక్షలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు గమణిస్తున్నారని అన్నారు. సబర్మతిని ప్రక్షాళన చేసుకున్న బీజేపీ మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చేపట్టిన మూసీ పునరుజ్జీవం కార్యక్రమానికి ప్రజల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. పునరుజ్జీవం ద్వారా మూసీ ప్రజల కష్టాలు తీరడంతో పాటు, వరదలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.