పాకాల రాజుది కూడా అక్రమమేనని తేల్చిన అధికారులు
అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా నిర్మాణాలు
ఆర్టీఐకిస్వేచ్ఛ-బిగ్‌టీవీ దరఖాస్తు.. బయటపడిన గుట్టు
ఇటీవల రేవ్‌పార్టీతో అడ్డంగా దొరికిన కేటీఆర్ బావమరిది
రెయిడ్‌లో డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికిన విజయ్ మద్దూరి
ఫామ్‌హౌజ్ కాదు రాజు సొంతిల్లు అని బుకాయింపులు
బీఆర్ఎస్ హయాంలో బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం
పదేళ్ల కేసీఆర్ పాలనలో లెక్కలేనన్ని స్కామ్‌లు వెలుగులోకి
సొంత వాళ్లను అందలమెక్కించిన తీరుతో విస్తుపోతున్న ప్రజలు
రాజ్ దర్బార్ అంటూ అక్టోబర్ 9న ‘స్వే్చ్ఛ’ సంచలన కథనం
పదేళ్ల కల్వకుంట్ల రాజ్యంలో తెలంగాణ సర్వనాశనమైందనే విమర్శలు, లెక్కలేనన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పర్యాయాలు బీఆర్ఎస్‌ను గెలిపించినా ప్రజలను ఉద్దరించకపోగా, తన కుటుంబాన్ని మాత్రం ఊహకందని రీతిలో తీర్చిదిద్దుకున్నారని స్కామ్‌లు చెప్పకనే చెబుతున్నాయి. పైకి అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకునే కేసీఆర్ కుటుంబం లోలోపల మాత్రం కావాల్సినంత దోచేసుకుందని లెక్కలతో సహా తేలిపోయింది. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఓ వైపు కేటీఆర్, మరోవైపు హరీష్‌రావులు చేసిన అడ్డగోలు పనులన్నీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బయటపడుతున్నాయి. ఇక కేసీఆర్ కుమార్తె కవిత గురించి అయితే ప్రత్యేకించి చెప్పడానికి లేదు. గల్లీ నుంచి ఢిల్లీకెళ్లి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయి, తీహార్ జైలులో ఊచలు లెక్కపెట్టి వచ్చారు. ఈ ముగ్గురే కాదు, వీరి బంధువులు, వారి కుటుంబ సభ్యులు ఇలా ఒకరిద్దరు కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితానే ఉంది.
తీగ లాగితే..
కేసీఆర్ పాలనలో జరిగిన వ్యహారాలన్నీ పూటకో అక్రమ ఫామ్‌హౌజ్, రెండ్రోజులకో భారీ స్కామ్ వెలుగు చూస్తున్నాయి. దీంతో వామ్మో ఇంత చేశారా అంటూ గులాబీ పార్టీ నేతలే అవాక్కవుతున్న పరిస్థితి. పేదలకు కూడు, గుడ్డ సంగతి పూర్తిగా పక్కనెట్టిన నాటి ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఒక్కొక్కరి ఒక్కో ఫామ్‌హౌజ్‌లు నిర్మించేసుకునేందుకు సహకరించింది. అక్రమ ఫామ్‌హౌజ్‌లకు కేరాఫ్‌గా మారిన కేటీఆర్ ఫ్యామిలీలో మరో సంచలన విషయం బయటకొచ్చింది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు వాడుతున్న ఫామ్‌హౌజ్‌లను అక్రమ కట్టడాలుగా అధికారులు గుర్తించగా, ఇప్పుడు రేవ్‌పార్టీతో దేశవ్యాప్తంగా అందరినోళ్లలో నానిన కేటీఆర్ బామ్మర్ధి పాకాల రాజు ఫామ్‌హౌజ్ కూడా అక్రమ కట్టడమేనని అధికారులు తేల్చేశారు. అసలు అక్కడ బిల్డింగ్‌లు కట్టడానికి ఎలాంటి పర్మిషన్లు లేవని అధికారులు చెబుతున్నారు. స్వేచ్ఛ-బిగ్‌టీవీ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చిన జన్వాడ పంచాయతీ కార్యదర్శి ఈ ఫామ్‌హౌజ్ నిర్మించడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ సమాధానం ఇచ్చారు. గత పదేళ్లలో ఎలాంటి అరాచక పాలన సాగిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టీఐ రిప్లై చాలు. కళ్లముందు అక్రమంగా భవనాలు కడుతున్నా కేటీఆర్ ఏం చేస్తారో అన్న భయంతో అధికారులంతా కళ్లు మూసుకుని కూర్చున్నారడానికి జన్వాడ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఈ సమాధానమే నిలువెత్తు సాక్ష్యం.
దేశ వ్యాప్తంగా చర్చ
ఇటీవలే పాకాల రాజు తన ఫామ్‌హౌజ్‌లో మందు పార్టీ నిర్వహించారు. ఆ పార్టీపై అందిన ఫిర్యాదుతో పోలీసులు రెయిడ్ చేసి డ్రగ్స్ టెస్ట్ చేస్తే, కేటీఆర్ దోస్త్ మద్దూరి విజయ్ కొకైన్ సేవించినట్లు తేలింది. ఈయన రాష్ట్రం వదిలి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చ జరిగిన పరిస్థితి. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే అది ఫామ్‌హౌజ్ కాదని, సొంత ఇల్లు అంటూ కూడా కేటీఆర్ అప్పట్లో తన బావమరిది తప్పేమీ లేదన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.కానీ, అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదంటూ స్వేచ్ఛ-బిగ్‌టీవీకి సమాచారం ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి. అంతేకాదు జులై 7, 2022, జనవరి 30, 2023, ఫిబ్రవరి 8, 2023న మొత్తం మూడు సార్లు అక్కడ బిల్డింగ్స్ అక్రమంగా కడుతున్నట్లుగా నోటీసులు ఇచ్చారు. కానీ ఈ నోటీసులకు పాకాల రాజు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఓ వైపు నోటీసులు వస్తూనే ఉన్నా లెక్క చేయకుండా ఫామ్‌హౌజ్‌ను కంప్లీట్ చేశారు. అక్కడ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఈ ఫామ్‌హౌజ్ కట్టే సమయానికి, నోటీసులు ఇచ్చిన సమయాల్లోనూ రాష్ట్రంలో అధికారంలో బీఆర్‌ఎస్ పార్టీనే ఉంది. మంత్రి కేటీఆర్ ప్రభుత్వం అంతా తానే అన్నట్లుగా నడిపిస్తూనే ఉన్నారు. పంచాయతీ అంటే ఓ రకంగా గ్రామస్థాయిలో ప్రభుత్వమే, అలాంటి ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకూ సమాధానం ఇవ్వకపోతే బావమరిదిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.
ఏమైనా చేసేస్తారా?
అధికారం తమ చేతుల్లోనే ఉంది కాబట్టి తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనుకున్నారా? తాము రూల్స్‌ను డిసైడ్ చేసే వాళ్లమే కానీ, పాటించే వాళ్లం కాదనుకున్నారా? లేక తమ అడ్డగోలు వ్యవహారాలకు అడ్డుపడేది ఎవరని విర్రవీగారా? కేటీఆర్ అండ లేకపోతే ఇంతగా ఆయన బామ్మర్ధి పాకాల రాజు తెగించగలుగుతారా? పదేళ్ల పాటు అద్భుతమైన పాలన అందించామని పదే పదే చెప్పుకునే కేటీఆర్ దానికి ఎగ్జాంపుల్ ఇదే అంటారా? కేటీఆర్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు పాకాల రాజు ఫామ్‌హౌజ్ అక్రమ కట్టడమని పంచాయతీ అధికారులే తేల్చారు కాబట్టి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుది అనే దానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది. జన్వాడ ఫామ్‌హౌజ్‌లో పార్టీతో మొదలై అనేక మలుపులు తిరిగి అక్రమమని తేలే వరకూ వచ్చింది. ఈ వ్యవహారంతో రాజు పాకాలతో పాటు, కేటీఆర్ కూడా అడ్డంగా బుక్కయినట్లే, చిక్కులు కొని తెచ్చుకున్నట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ముందే చెప్పిన స్వేచ్ఛ
బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యంగా కేటీఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెట్టారని, క్లియరెన్స్ లేకుండానే 7 ఎకరాల్లో ఫామ్‌హౌజ్ నిర్మించారని స్వేచ్ఛ ఇన్వె్స్టిగేషన్ తేలడంతో అక్టోబర్ 9న సంచలన కథనాన్ని ప్రచురించింది. మొత్తం 6,700 గజాల్లో కోట్లు గుమ్మరించి ఇంద్ర భవనం నిర్మించి, ఇంపోర్టెడ్ సామాగ్రితో సొబగులు అద్దారని కళ్లకు కట్టినట్లుగా స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీమ్ తేల్చింది. అయినా సరే అది ఫామ్‌హౌజ్ కానే కాదని, తన బావమరిది ఇల్లు అని కేటీఆర్ బుకాయించారు కానీ, ఆర్టీఐ దరఖాస్తుతో బావ, బావమరిది ఇద్దరూ అడ్డంగా బుక్కైపోయారు. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చినవి ఇవే, మున్ముందు ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో అని గులాబీ నేతలు, తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏం చెబుతారు సార్?
బాధ్యాతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్న కేటీఆర్ అండ్ కో, నాలుగు మంచి పనులు చేయాల్సింది పోయి, ఇలాంటి చెత్త పనులు చేశారనే విషయాలు వెలుగులోకి రావడంతో రెండు దఫాలుగా గెలిపించిన ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరిపిన మీరు, మీ బంధువులు ప్రజలకు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు? పోనీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఫామ్‌హౌజ్‌లను హైడ్రా రంగంలోకి దిగక ముందే, స్వచ్ఛందంగా కూల్చివేసే ధైర్యం ఉందా? అసలు ఆ దిశగా అడుగులు పడతయా? హైడ్రాకు అడ్డు పడకుండా సహకరించే పరిస్థితి ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇంత జరిగిన తర్వాత కనీసం మీడియా ముందుకు వచ్చే సాహసం కేటీఆర్ చేస్తారా? అన్నది కూడా డౌటేనని విమర్శకులు చెబుతున్న మాట.