CM Revanth Reddy: తిరుపతిలో మాటలకందని విషాదం.. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉండగా.. ఇద్దరు పురుషులు ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌ల్లో తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించారు. రుయా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్‌లో 9 మంది చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులంతా 40 ఏళ్లు పై బడిన వారేనని చెబుతున్నారు.
తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ ల జారీలో జరిగిన తొక్కిసలాటలో.. భక్తులు మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంతటి దుర్ఘటన జరగడం అత్యంత విచారకరమని వాపోయారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించి వారిని ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా టీటీడీ పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులతో మాట్లాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరారు.
Also Read: చెడు జరుగుతుందని ముందే గ్రహించా.. అధికారులదే తప్పిదం.. టీటీడీ చైర్మన్
తిరుమలలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాపోయారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు. భగవంతుడు ఆయన పాదాల చెంత మరణించిన వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకొని స్వస్థలాలకు చేరుకోవాలని భగవంతుని ప్రార్ధన.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర బాధాకరమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ క్లిష్ట సమయంలో సాధ్యమైనంత సహాయం అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అటు ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు పురందీశ్వరి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
తిరుపతిలో జరిగిన విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేశారు. తిరుపతి విష్ణు నివాసం టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని..దురదృష్ట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అమిత్ కోరారు.