Lift Irrigation: స్వేచ్ఛ బ్యూరో: ఈ వర్షాకాలంలో వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ కు నీళ్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ అంజనగిరి, బిజినేపల్లి మండలంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సీఎం మాట్లాడుతూ.. 2020- 2023 సంవత్సరం నాటికి రూ 3300 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేయగా, 2023వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 800 కోట్ల రూపాయలను ఖర్చుచేసి ప్రాజెక్ట్ పనులను కొనసాగించడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న మిగతా సివిల్ పనులను 90 కోట్ల రూపాయలతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
ఎత్తిపోతుల ద్వారా నీటిని తరలిస్తాం..
ఇక్కడ మొత్తం 10 పంపులు ఉండగా 5 పంపులను ఫిట్ చేసి ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. వర్షాకాలంలో నీళ్లు రాగానే వెంకటాద్రి రిజర్వాయర్ కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం 16.74 టీఎంసీలు కాగా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం ద్వారా విడతల వారీగా రిజర్వాయర్ ను నింపడం జరుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12లక్షల 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీటికి, పరిశ్రమలకు కూడా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రితో కలిసి కాలువల నిర్మాణ పనులను సందర్శించి, జరుగుతున్న పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, పాలమూరు ప్రాంతానికి సాగు మరియు తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రజా ప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతల అరెస్టు
ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆందోళనలకు దిగడంతో పోలీసులు నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, బిజినేపల్లి మండలాల్లోని పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు.
Also Read: సిద్దిపేటలో పర్యావరణ వేడుకలు.. మంత్రి పొన్నం, ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు!