Revanth Reddy: ఇబ్రహీంపట్నంలోని AVN లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. పేదరికానికి ప్రధాన కారణం నాణ్యమైన విద్య అందకపోవడమేనని అభిప్రాయపడిన ఆయన, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు.. గౌరవం లభిస్తాయన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున లక్షా 8 వేల రూపాయలు ఖర్చు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో తన బ్రెయిన్ చైల్డ్ లాంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక్కో పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. దాదాపు 2,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో, రూ. 20,000 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నప్పటికీ, వారిలో చాలామందికి కేవలం సర్టిఫికెట్లే ఉంటున్నాయని, సరైన ఉపాధి నైపుణ్యాలు (Skills) ఉండటం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, అందుకే విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఇందుకోసమే ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, దీని ద్వారా నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తామని వివరించారు.
విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2034లో జరిగే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుండి క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బాక్సర్ నిక్కత్ జరీన్ మరియు క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌లకు డిఎస్పీ (DSP) ఉద్యోగాలు కల్పించి క్రీడాకారులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో రాణించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 18 లక్షల మంది ఉంటే, 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వ విద్య ఎందుకు వెనుకబడిందో అందరూ ఆలోచించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగించేలా విద్యా సంస్కరణలు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. ఆరుట్ల మోడల్ స్కూల్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెండో విడతలో మరిన్ని స్కూళ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Read Also: మీది బుల్డోజర్ల పాలన.. మీరు మాకు చెబుతారా..? సీఎం రేవంత్‌కు పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్