CM Revanth Reddy: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ నిర్వహించారు. క్లైమేట్ చేంజ్ పరిశోధకులు, ఆర్థిక నిపుణులు, మేధావుల సమక్షంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం చేపట్టిన బృహత్ కార్యాచరణ అని స్పష్టం చేశారు. అసంపూర్తి సమాచారంతో లేదా ఉద్దేశపూర్వకంగా అర్థ సత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడే కాపలాదారుగా మాత్రమే ఈ అధికారాన్ని వినియోగిస్తానని, ప్రజలపై ఆధిపత్యం చలాయించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు.
ప్రపంచ చరిత్రను ఒకసారి గమనిస్తే.. గొప్ప నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే విలసిల్లాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తాను స్వయంగా న్యూయార్క్‌లోని హడ్సన్ రివర్, లండన్, సింగపూర్, దుబాయ్ వంటి నగరాలను సందర్శించి అక్కడ నదీ తీరాల అభివృద్ధిని గమనించినట్లు తెలిపారు. ఇతర దేశాలు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంటే, మనం ఇంకా అభివృద్ధి నిరోధకులుగా మారి మౌనంగా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆయన హెచ్చరించారు. గత రెండు ఏళ్లుగా వందల గంటల పాటు నిపుణులు, ఆర్థిక, పర్యావరణ కన్సల్టెంట్లతో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ మూసీ ప్రాజెక్టును పట్టాలెక్కించినట్లు వివరించారు.
హైదరాబాద్ నగర నిర్మాణంలో నిజాం ప్రభువుల దూరదృష్టిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. 1908లో వచ్చిన భీకర వరదలకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, నిజాం రాజు చలించిపోయి మోక్షకుండం విశ్వేశ్వరయ్య వంటి గొప్ప ఇంజనీర్ సలహాతో వరద నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఆనాడు 1921లో నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులే నేటికీ కోట్లాది మంది హైదరాబాద్ వాసుల దాహార్తిని తీరుస్తున్నాయని కొనియాడారు. 110 ఏళ్ల క్రితమే నిజాం సర్కార్ అంతటి విజన్‌తో నగరాన్ని నిర్మిస్తే, నేడు మనం ఆధునిక కాలంలో ఆ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
రాజకీయంగా విమర్శలు చేయడం కంటే సూచనలు ఇవ్వడం మేలని ప్రతిపక్షాలకు సూచించారు. 12 ఏళ్లు కేంద్రంలో, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు తమ మేధో సంపత్తిని ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాకుండా అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 2 కోట్ల 80 లక్షలకు చేరుకోబోతోందని, వారందరికీ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. 1994 నుండి 2024 వరకు గత పాలకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వంటి వారు చేపట్టిన మంచి విధానాలను తాము కొనసాగిస్తున్నామని, విధానపరమైన అస్పష్టత (Policy Paralysis) తమ ప్రభుత్వంలో లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాను రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
అభివృద్ధి అనేది కేవలం భవనాల నిర్మాణంతోనే ముగియదని భవిష్యత్తు తరాలకు అవసరమైన ప్రణాళికలు రచించినప్పుడే చరిత్రలో పాలకులు నిలిచిపోతారని ఉద్ఘాటించారు. 110 ఏళ్ల క్రితమే నిజాం ప్రభువులు మోక్షకుండం విశ్వేశ్వరయ్య వంటి మేధావుల సలహాలతో నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. చార్మినార్‌ను కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా దాని చుట్టూ ముత్యాలు గాజులు వంటి విభిన్న వ్యాపారాలతో ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని (SEZ) సృష్టించారని కొనియాడారు. నేడు మనం అనుభవిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి యూనివర్సిటీ నీలోఫర్ నిమ్స్ వంటివన్నీ ఆనాడు వారు వేసిన పునాదులేనని పేర్కొన్నారు.
నగరంలో మూసా ఈసా నదుల సంగమ ప్రాంతమైన బాపు ఘాట్‌కు కన్యాకుమారి తరహాలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తన సంకల్పమని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరంలోని డ్రైనేజీలు పరిశ్రమల కాలుష్యం వల్ల మూసీ నది కలుషితమై విషంగా మారిందని ఇది హైదరాబాద్ కంటే ఎక్కువగా నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండలో ఫ్లోరోసిస్ శాపానికి తోడు ఈ కాలుష్యం వల్ల పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో జన్మిస్తున్నారని ఆ ప్రాంత ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని వాపోయారు. నల్గొండ ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత మనపై ఉందని వారిని ఈ మురికి కూపం నుండి కాపాడటమే మూసీ ప్రక్షాళన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ పగతోనే ఈ బృహత్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ బీజేపీ నేతలు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తాము అధికారాన్ని ప్రజలపై ఆధిపత్యం చలాయించడానికి కాకుండా ఒక కాపలాదారుగా నగరాన్ని రక్షించడానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. “నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న సామాన్య రైతు బిడ్డను.. ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నాను” అని పేర్కొంటూ పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నిరాశ్రయులయ్యే ప్రతి కుటుంబానికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని ఇందుకు ఇప్పటికే 10,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని భరోసా ఇచ్చారు.
ప్రాజెక్టు వ్యయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం ఎండగట్టారు. మొత్తం రూ. 7,000 కోట్ల వ్యయంలో గాంధీ విగ్రహం వంటి నిర్మాణాలకు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని ఇది ప్రాజెక్టు మొత్తంలో 2 శాతం కంటే తక్కువేనని వివరించారు. గోదావరి నది నుండి 20 టీఎంసీల నీటిని తరలించి మూసీలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం నది అందమే కాకుండా దాని వెంబడి ఎకనామిక్ జోన్లు పర్యాటక క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. భారత సైన్యం (Army) కూడా తమ పరిధిలోని 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకు రావడం ప్రాజెక్టు ప్రాముఖ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రాజెక్టును అడ్డుకునే వారు దేవతల యజ్ఞాలను భగ్నం చేసే రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. లోక కల్యాణం కోసం చేసే ఈ యాగంలో ప్రతిపక్షాలు రక్తం మాంసాలు పోసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గేది లేదని మేధావులు నిపుణులు ఇచ్చే ప్రతి సలహాను స్వీకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది భవిష్యత్తు తరాలకు అద్భుతమైన నగరాన్ని అందించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించకపోతే రానున్న కాలంలో హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారుతుందని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవనం ద్వారా భూగర్భ జలాల నాణ్యత పెరుగుతుందని కాలుష్యం తగ్గుతుందని వివరించారు. నగర ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తామని ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.