CM Revanth Help : ఓ చిన్న స్పందన కొందరి జీవితాన్ని మార్చేస్తుంది. మిగతా వాళ్లకు చిన్న సాయమే అయినా.. అవసరంలో ఉన్న వారికి మాత్రం అతిపెద్ద ఉపకారం అవుతుంది. అలాంటి చిరు సాయంతోనే ఓ మహిళ జీవితానికి కొండత భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పేపర్లో వచ్చిన ఓ వార్తను చూసి స్పందించిన సీఎం.. మానవత్వాన్ని చాటుకున్నారు. తన స్పందనతో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచేలా వ్యవహరించారు.
సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం గుండ్లసింగారానికి చెందిన సలీమా అనే మహిళ… తొమ్మిదేళ్ల క్రితం క్షణికావేశంతో ఒంటికి నిప్పంటించుకుంది. దాంతో.. ఆమె శరీరం తీవ్రంగా కాలిపోయి.. మంచానికే పరిమితమయ్యారు. ఎటూ కదల్లేని స్థితికి చేరుకుంది. తన పనులు సైతం తాను చేసుకోలేని స్థితికి చేరుకుంది. దాంతో.. ఆమె అనేక రకాలుగా ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో సలీమా పదేళ్ల కుమార్తె రిజ్వానా సపర్యలు చేస్తుంది. చిన్న వయస్సులోనే అతిపెద్ద బాధ్యతలు భుజానికెత్తుకుని కష్టపడుతోంది.
ఈ విషయం ఆ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు అనేక మందికి ఆవేదన కల్పిస్తోంది. తన పనులు తాను చేసుకుంటూ.. తల్లిని చూసుకూంటూ చిన్నారి బడికి వెళుతుంది. చిట్టి చేతులతో వంటలు చేసుకుని, తాను తిని, తన తల్లికి తినిపిస్తూ.. కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయమై.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. ఆ మహిళకు సహాయంగా నిలవాలని, ఆమెకు అవసరమైన సాయం అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం రేవంత్ రెడ్డి.. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించాలని సూచించారు. అలాగే.. దివ్యాంగుల పింఛను ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
కనీసం వంట చేసుకుని సైతం తినలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు.. చిన్నారి వండి పెడుతుందన్న విషయం తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. ఆమెకు.. తక్షణమే భోజనం సదుపాయం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. అధికార యంత్రాంగం హుటాహుటిన స్పందించింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, చిన్నారి చదువు గురించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం గురించి చర్చించారు. ఆమెకు భోజనం, నివాస ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు.