CM Revanth Reddy: వారంతా కూలీలు. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అంతలోనే సైలెంట్ గా ఓ నేత వస్తున్నారు. పోలీసుల హడావుడి కూడా అంతగా లేదు. కానీ సైలెంట్ గా వచ్చిన ఆ నేత తన స్వరంతో అన్నా.. అంతా మంచిగుందా.. కైసే హై ఆప్ అంటూ పలకరించారు. కూలీలంతా షాక్. తమను ఏకంగా వచ్చి ఆ నేత పలకరించడంతో వారంతా ఆనంద పడ్డారు.. చిరునవ్వులు చిందించారు. ఇంతకు ఆ నేత ఎవరో కాదు.. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
సింప్లిసిటీ కి మారుపేరుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈరోజు సీఎం సింప్లిసిటీని ప్రత్యక్షంగా చూశారు పలువురు కూలీలు. ఇందుకు వేదికగా మారింది రాష్ట్ర సచివాలయం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
డిసెంబర్ 7, 8, 9వ తేదీలలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, సచివాలయం వద్ద విజయోత్సవ కార్యక్రమాలను భారీగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9వతేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, చుట్టూ వాటర్ ఫౌంటైన్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ పనిచేస్తున్న కూలీలతో సరదాగా మాట్లాడారు. వారి బాగోగులను సైతం అడిగి తెలుసుకున్న సీఎం, త్వరితగతిన విగ్రహ ఏర్పాటు పనులు పూర్తిచేసేలా చూడాలని సూచించారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తమను పలకరించడంతో ఆ కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఇటీవల వేములవాడ, వరంగల్ లలో విజయోత్సవ సభలను నిర్వహించగా పెద్ద ఎత్తున సభలకు ప్రజలు హాజరై విజయవంతం చేశారు. ఈనెల 25వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు విజయోత్సవ సభను సైతం ప్రభుత్వం నిర్వహించనుంది. ఏడాది కాలం పాటు అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందడంతో, విజయోత్సవ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.