CM Revanth Reddy: జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది.
హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఒప్పందం జరిగింది. ఇవాళ జపాన్ లో పలు కీలక ఒప్పందాలు చేసుకొనున్నది తెలంగాణ ప్రభుత్వం. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పోలో.. తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్‌ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటిచెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.
కాగా నిన్న కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టేకుచితో సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు లాగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి.
సుస్థిరత అనేది ఇకపై ఆప్షన్ కాదు అవసరం అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయటం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాద కరమై పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు సీఎం.
Also Read: ప్రధాని మోదీ.. పాలనా, విధ్వంసమా? ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్– కిటాక్యూషు రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ఏర్పాటు చేయాలనే అంశం చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్‌లో యువ శక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే, అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది, పరిశుభ్రమైన నదీతీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు సీఎం రేవంత్ పర్యటన జపాన్ లో కొనసాగబోతోంది. ఇందులో భాగంగా టోక్యో, మౌంట్ ఫ్యూజీ, ఒసాకా, హిరోషిమా తదితర నగరాల్లో షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో సహకారం ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటన సాగుతున్నా.. చాలా అంశాలను మన దగ్గర ఇంప్లిమెంట్ చేసుకునే వీలు కూడా కలుగుతోంది. అందుకే జపాన్ లో వారం పాటు పర్యటన పెట్టుకున్నారు సీఎం. తన పరిశీలన తర్వాత టోక్యో నగరం స్పెషాలిటీ, ఇక్కడి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు సీఎం.