Cm Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తైంది. ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభను వరంగల్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో తెలంగాణ ఛైతన్యపు రాజధాని అని ఓరుగళ్లును కొనియాడారు. కాళోజీ నుండి పీవీ వరకు…మహనీయులను తీర్చిదిద్దిన నేలని చెప్పారు. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ అని తెలిపారు.
హక్కుల కోసం వీరపోరాటం చేసిన…సమ్మక్క – సారలమ్మలు …నడయాడిన ప్రాంతమని పేర్కొన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రమని తెలిపారు. వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు నేడు వస్తున్నానని ట్వీట్ లో సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సీఎం ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ హన్మకొండల అభివృద్ధికి నిధులు కేటాయించారు. 2040 టార్గెట్ గా వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.