CM Revanth Reddy: తెలంగాణకు రావాల్సిన నిధులు అందేలా చూడాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం చొరవ చూపాలని సీఎం ప్రత్యేకంగా కేంద్రాన్ని కోరారు.
రాజస్థాన్ పర్యటన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణ నిధులు, రైల్వే ప్రాజెక్ట్ల పూర్తి, పలు అంశాలపై సీఎం రేవంత్ సుధీర్ఘ చర్చలు జరిపారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో భేటీ కాగా, పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్ లపై సీఎం చర్చించారు. అందులో కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, వికారాబాద్ – కృష్ణ స్టేషన్ల మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలుమార్గం నిర్మించాలని కోరారు.
అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ కాగా కీలక అంశాలపై చర్చ సాగింది. వెనక బడిన జిల్లాలకు పునర్విభజన చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులను వెంటనే తెలంగాణకు విడుదల చేసేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు. నాలుగేళ్ల నుండి పెండింగ్ లో ఉన్న రూ. 1800 కోట్లు తక్షణం విడుదల చేయాలన్నారు. ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం రూ.408 కోట్లను ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పించాలని కేంద్రాన్ని కోరారు.
విదేశీ ఆర్ధిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుండి ఏకపక్షంగా రూ. 2,547.07 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్ష ఆదేశాల పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సీఎం. అలాగే ఈ విషయంలో మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రాన్ని కూడా సీఎం అందజేశారు.
Also Read: Allu Arjun Arrest: ఇది రేవంత్ సర్కార్.. బిగ్ బాస్ విన్నరైనా.. నేషనల్ అవార్డ్ అందుకున్నా.. ఒకే న్యాయం
అయితే కేంద్రాన్ని సీఎం కోరగా, సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా తెలంగాణ పట్ల వివక్షత చూపకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరితగతిన అందేలా చూడాలని సీఎం కోరారు. సీఎం వెంట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా భేటీలలో పాల్గొని తమ వాణి వినిపించారు. మరి కేంద్రం ఏమేరకు స్పందిస్తుందో.. నిధులను ఇవ్వడంలో ఎంత చొరవ చూపిస్తుందో వేచిచూడాలి.