Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ బన్నీ అరెస్ట్ బూచిగా చూపిస్తూ.. పొలిటికల్ డ్రామాలకు తెరలేపుతున్నాయి పలు పార్టీలు. కానీ ఇక్కడే ఒక విషయం చర్చకు దారి తీస్తోంది. అదే బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సమయంలో, బన్నీ అరెస్ట్ సమయంలో పోలీసుల వైఖరికి పోల్చి సోషల్ మీడియా కోడై కూస్తోంది. దటీజ్ కాంగ్రెస్ సర్కార్ అంటూ.. నెటిజన్స్ పోస్టులు పెడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కితాబిస్తున్నారు.
బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రశాంత్ ను వేరే దారిలో పంపించినా, మళ్లీ ప్రశాంత్ రావడం, ర్యాలీ చేయడం, అభిమానుల తాకిడితో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో, ప్రశాంత్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
అలాగే పుష్ప 2 రిలీజ్ సంధర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో, తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మహిళ ప్రాణం పోయింది. అలాగే ఓ బాలుడు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి తరుణంలో పోలీసులు సేమ్ టు సేమ్ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న రీతిలో వ్యవహరించారు. కేసు నమోదు చేసి, ఇప్పటికే ముగ్గురిని జైలుకు తరలించారు. హీరో అల్లు అర్జున్ రాకతోనే తొక్కిసలాట జరిగిందని, అందుకు కారకులుగా బన్నీన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Revanth Reddy on Allu Arjun: అందరూ సమానమే.. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
సినిమా రిలీజ్ అయిన టైంలో… అల్లు అర్జున్ పై కేసు నమోదు కాలేదని, పల్లవి ప్రశాంత్ కు ఓ న్యాయం, అల్లు అర్జున్ కు ఓ న్యాయమా అంటూ ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే కొంత మంది…. అలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా చట్టం ముందు అందరూ సమానులేనన్న విషయం అల్లు అర్జున్ అరెస్ట్ తో బహిర్గతమైందని ఓ వర్గం నెటిజన్స్ వాదిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్.. ఇక్కడ అందరూ సమానులే.. పల్లవి ప్రశాంత్ అయినా, అల్లు అర్జున్ అయినా ఒకటేనంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏది ఏమైనా పోలీసులు మాత్రం తమ విధి నిర్వహణలో భాగంగా బన్నీని అదుపులోకి తీసుకుంటే, అనవసర రాజకీయాలు చేసి రచ్చ చేయొద్దంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు.