CM Revanthreddy Speech: అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ తల్లిని అధికారికంగా ఇప్పటి వరకు గౌరవించుకోలేదన్నారు. తెలంగాణ మాతృమూర్తిని గౌరవించాలనే లక్ష్యంతో సచివాలయ ప్రాంగణంలో ఆ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని తాము సంకల్పించినట్లు పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ, నమ్మక్క-సారక్క స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు విగ్రహం ప్రతి రూపమన్నారు. తెలంగాణ తల్లి భావన కాదు, నాలుగు కోట్ల మంది భావోద్వేగమన్నారు. తెలంగాణ తల్లి పీఠంలో నీలి రంగు కృష్ణ, గోదావరి నదులకు సంకేతమని వెల్లడించారు. ఉద్యమం సమయంలో సబ్బండ వర్గాలను నడిపించిందీ తెలంగాణ తల్లి అని గుర్తు చేశారు.
తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన గొప్ప అనుభూతి కలుగుతుంద న్నారు. ఈ విగ్రహం ద్వారా తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు ఇస్తున్నామని సభలో వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గడిచిన పదేళ్లు తెలంగాణకు రాష్ట్ర గీతం లేకుండా పోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జయ జయ హే తెలంగాణ’ గీతానికి అధికారిక గుర్తింపు కల్పించామన్నారు.
తెలంగాణను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం. చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ తల్లి ఉండాలనే ఆ తల్లికి గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 9 ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చేయాలన్నదే ఆలోచనగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన సచివాలయ ప్రాంగణంలో ఇవాళ సాయంత్రం 6.05 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది.
ALSO READ: అసెంబ్లీ గేటు వద్ద హై టెన్షన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
ఒకానొక దశలో తెలంగాణ దేవత- తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజ కీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చిందన్నారు. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచన చేశారన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫూర్తి కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నామన్నారు.
నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవ శాత్తు కొంతమందికి ఇది నచ్చలేదన్నారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పుగా వర్ణించారు. మధ్య యుగాల చక్రవర్తులు పాలన మాదిరిగా ఇవాళ నడవదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంది.
పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమానికి రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు అందరూ హాజరుకావాలని అసెంబ్లీ వేదికగా రేవంత్ ఆహ్వానించారు. ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం సమయం కేటాయించాలన్నారు. ఇవాళ ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ, ఇక్కడ ప్రజలతో సోనియమ్మకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని తెలిపారు.
దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణలో గొప్ప పర్వదినమని పేర్కొన్నారు. ఆ తర్వాత వివిధ పార్టీలకు చెందిన సభ్యులు తెలంగాణ తల్లి విగ్రహంపై మాట్లాడారు.
ప్రతియేటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి #TelanganaTalli #RevanthReddy #Bigtv pic.twitter.com/2bnGq5MiM6
— BIG TV Breaking News (@bigtvtelugu) December 9, 2024