Wine Shops Applications: తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. శనివారం చివరి రోజు కావడంతో సాయంత్రం నుంచి గంట గంటకు దరఖాస్తులు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటికి 2620 మద్యం షాపులకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు దరఖాస్తులు 30 వేల నుంచి 40 వేల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. చివరి రోజు వైన్స్ టెండర్ల జోరు కనిపిస్తుంది. 82 మద్యం షాపులకు 3500 అప్లికేషన్లు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
గత సంవత్సరంతో పోలిస్తే దరఖాస్తులు తగ్గిన ఆదాయం మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. సెప్టెంబరు 27 నుంచి మొదలైనా దరఖాస్తుల స్వీకరణ తొలుతగా మందకొడిగా కొనసాగింది. కానీ చివరి మూడు రోజులుగా ముందస్తుగా అనుకున్న రీతిలో దరఖాస్తులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి.
శనివారం రాత్రి వరకు గ్రాండ్ టోటల్‌గా 80-90 వేల అప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన వారికి టోకన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తు పెంపుతో ఎక్సైజ్ శాఖ ఆశించిన స్థాయిలో ఈసారి ఆదాయం వస్తు్న్నట్లు కనిపించడం లేదు. చివరి రోజుపైనే ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర కారణాలతో దరఖాస్తులు పెరుగుతాయని భావించారు. అయితే శనివారం బీసీ బంద్ చేపట్టడంతో ఆ ప్రభావం లిక్కర్ షాపులపై పడింది.
తెలంగాణ వ్యాప్తంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు 12 వేల అప్లికేషన్స్ వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.