BRS Party Future: ఏ రాజకీయ పార్టీకైనా సభ్యత్వ నమోదు, రాష్ట్రస్థాయి కమిటీలు అనేవి చాలా కీలకం. అవే పార్టీకి కొండంత బలం. ఇంకా చెప్పాలంటే కమిటీ ప్రకటన అనేది క్షేత్రస్థాయి కేడర్ కు ఓ బూస్టర్ డోస్ లాంటిది. ఇంతటి కీలక ఘట్టాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పట్టించుకోవడంలేదు. అంతేకాదు అక్టోబర్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సభ్యత్వ నమోదు చేయలేదు. రాష్ట్ర కమిటీలో మార్పులు-చేర్పులు అస్సలే లేవు. ఉన్నవాళ్లతోనే కాలం వెల్లదీసే పరిస్థితి. అటు జిల్లాల్లో పార్టీ అనుబంధ కమిటీలు లేనేలేవు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పరిస్థితి ఎందుకింతలా తయారైంది. సభ్యత్వ నమోదుపై ఎందుకీ సస్పెన్స్. కమిటీల ప్రకటనపై ఎందుకీ కాలయాపన.
2023 నుంచి వరుస షాకులే
ఒకే ఒక్క ఓటమి మొత్తం విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ఎస్.. గులాబీ పార్టీకి, కేసీఆర్ విషయంలో ఇది కరెక్టే అనిపిస్తోంది. వరుసగా తగిలే షాకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పవచ్చు. డిసెంబర్ 2023 నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులే తగులుతున్నాయి. అధికారం కోల్పోయి.. ఎంపీ ఎన్నికల్లోనూ గెలవలేక.. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేక ఆ పార్టీ రోజురోజుకు తన ప్రాభావన్ని కోల్పోతున్నట్టు కనిపిస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీని మళ్లీ రూట్ లెవల్ నుంచి స్ట్రెంతెన్ చేయాల్సిందే. కానీ ఆ దిశగా గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇటీవల తరుచుగా అనారోగ్యం పాలవుతున్నారు. పైగా కుమార్తె కవిత పార్టీ పేరు మీద కాకుండా జాగృతి సంస్థతో తన కార్యక్రమాలు నిర్వహించడం ఓ తలనొప్పిగా మారింది. కేసీఆర్ బయటకు రాకుండా ఉండటంతో.. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ కు కూడా ఢీలా పడిపోయింది. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదు, కమిటీల ప్రకటన మరింత ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గులాబీ పార్టీ సభ్యత్వ నమోదుపై గత కొద్దినెలలుగా సస్పెన్స్ నెలకొంది. అప్పుడు.. ఇప్పుడు ప్రారంభిస్తామంటూ చెబుతున్నారు. కానీ నెలలు దాటుతున్నా.. ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు.
అక్టోబర్‌లో ప్లీనరీ నిర్వహించే అవకాశం
గులాబీ పార్టీ సభ్యత్వంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ప్రారంభిస్తారా? లేదా? అనే చర్చ పార్టీలో చర్చకు దారితీసిందట. అక్టోబర్ లో ప్లీనరీ నిర్వహించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ అధిష్టానం చెబుతోంది. ఈ తరుణంలో అసలు ఎప్పుడు సభ్యత్వ నమోదు ప్రారంభిస్తారు. ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు. గ్రామస్థాయి నుంచి కమిటీలు ఎప్పుడు వేస్తారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయట. ఇలాంటి తరుణంలో ప్లీనరీకి ఎలా సన్నద్ధమవుతామనే చర్చ కేడర్ లో తిరుగుతుందట. జూన్ లోనే సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందని పార్టీ లీకులు ఇచ్చినా ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం లేదని సొంత పార్టీ నేతలే కామెంట్లు చేస్తున్నారంట.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు
బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాది ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ నిర్వహించింది. సభ సక్సెస్‌తో ప్రజల్లోకి వెళ్లాలని భావించింది కారు పార్టీ. అదే జోష్ లో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తారని అంతా అనుకున్నారట. అందుకు కారణం తొలుత సభ్యత్వ నమోదు చేస్తామని…ఆతర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీలు వేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేయడమే. గతంకంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి బీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టిస్తుందని పార్టీ నేతలు అనుకుంటున్నారు. అయితే రోజులు గడుస్తున్నాయి… నెలలు గడుస్తున్నా అడుగు ముందుకు పడకపోవడంతో కేడర్‌లో కొంత అసంతృప్తి నెలకొందట. సభ్యత్వ నమోదుతో మళ్లీ రీయాక్టివేట్ అయి ప్రజల దగ్గరకు వెళ్లొచ్చని నేతలు భావిస్తున్నారట. అయితే పార్టీ మాత్రం నమోదు ఎప్పటి నుంచి చేపడుతుందనేదానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత నైరాశ్యానికి గురవుతున్నారట. పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోవడంతోనే జాప్యం జరుగుతుందని నేతల మధ్య జరుగుతున్న చర్చ.
2021లో సభ్యత్వ నమోదు చేపట్టిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ ప్రతి రెండేళ్ల ఒకసారి పార్టీ సభ్యత్వ నమోదు చేయాల్సి ఉంది. అయితే పార్టీ మాత్రం 2021లో సభ్యత్వ నమోదు చేపట్టింది. 60లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని, ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్దమొత్తంలో సభ్యత్వాలు రికార్డు అని కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత చేయలేదు. 2023లో పాత సభ్యత్వ నమోదును చేయాల్సి ఉండగా రెన్యూవల్ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగించినట్లు పార్టీ నేతలు తెలిపారు. వరుస ఎన్నికల నేపథ్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగించలేదని పార్టీ అధిష్టానం వివరించింది. సభ్యత్వ నమోదు చేసి గ్రామస్థాయి నుంచి కమిటీలను వేయాల్సి ఉంది. అంతేకాదు అక్టోబర్ లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. ఇందుకు ప్రణాళిక బద్దంగా పార్టీ ముందుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఇంకా పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేతలు డిస్పాయింట్ అవుతున్నారట.
కమిటీ వేసి పర్యవేక్షణ చేయిస్తారా?
సభ్యత్వ నమోదుపై త్వరలో ప్రకటన చేసినా.. ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తుందట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగిస్తారా..మరెవరికైనా అప్పగిస్తారా…. లేకుంటే ఒక కమిటీ వేసి పర్యవేక్షణ చేయిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ నేతలు సైతం ఎదురుచూస్తున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. దాంతో ద్వితీయశ్రేణి నాయకులను పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలు అనే విధంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దాంతో రెండు వర్గాల మధ్య కో ఆర్డినేషన్ మిస్ అయింది.
కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు
మొన్నటి ఎన్నికల్లోనూ చాలా మంది ఓటమికి కూడా అదే కారణమని చర్చ నడుస్తుందట. ఇప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందట. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎలా విజయవంతం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేలుగానీ, మాజీ ఎమ్మెల్యేలు చెబితే కిందిస్థాయి నేతలు సభ్యత్వం చేస్తారా? అనే చర్చ జరుగుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దూరంపెట్టడంతో ఇప్పుడు సభ్యత్వం అంటే ఎలా చేస్తారని పలువురు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నారు. ఇన్ చార్జులు చెబితే నేతలు వినే పరిస్థితి కూడా లేదట. పార్టీ సుప్రీం జోక్యం చేసుకొని సందేశం ఇస్తే తప్ప సభ్యత్వం సక్సెస్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
2017 ప్లీనరీలో రాష్ట్ర కమిటీ ప్రకటన
ఇక.. బీఆర్ఎస్ పార్టీ 2017లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో రాష్ట్ర కమిటీని ప్రకటించింది. నూతన కార్యవర్గం ప్రకటించకపోవడంతో ఆ టీమే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అయితే అందులోని కొందరు నేతలు పార్టీలు మారారు. వాళ్ల స్థానాన్ని కూడా భర్తీ చేయకుండా ఉన్నవాళ్లతోనే కమిటీలను నెట్టుకొస్తున్నారు. 2021లో పార్టీ సంస్థాగత కమిటీలను వేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీవరకు 15 మంది సభ్యులతో కూడిన గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక తదితర పార్టీకి అనుబంధాలైన 14 సంఘాలను నియమించింది. అదే నెల 13 నుంచి 20వ తేదీవరకు మండల స్థాయిలో కమిటీలను వేసింది.
2022 జనవరి 26న జిల్లా అధ్యక్షుల ప్రకటన
2022 జనవరి 26న పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యవర్గాలను, అనుబంధ కమిటీలను నియమించలేదు. 2023లో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్లీనరీ సైతం నిర్వహించలేదు. కమిటీలపై దృష్టిసారించలేదు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. పార్టీని బలోపేతం చేయాలంటే.. నాయకులను, కార్యకర్తలను యాక్టీవ్ చేయాలంటే.. రాబోయే ఎన్నికల వరకు పార్టీని స్ట్రాంగ్ చేయాలంటే కమిటీలు కీలకం. కేడర్ కు బాధ్యతలు అప్పగిస్తే తప్ప పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేదని కొందరు నేతలు బహిర్గంగానే చెబుతున్నారట. మొత్తం మీద, ఎన్నికల పరాజయాలు, నాయకత్వ సంక్షోభం, సంస్థాగత బలహీనతలు, అంతర్గత విభేదాలు, నాయకులపై ఉన్న కేసులు వంటి కారణాలతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతోంది.
Story By Venkatesh, Bigtv