BigTV English

Palamuru: ఓవర్ టు పాలమూరు.. అంతా గిరిజనుల చుట్టూనే ఎందుకు?

Palamuru: ఓవర్ టు పాలమూరు.. అంతా గిరిజనుల చుట్టూనే ఎందుకు?

Palamuru: దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ పేరుతో ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ భారీ బలప్రదర్శన చేసింది. ఇంఛార్జ్ థాక్రే సమక్షంలో హస్తం పార్టీ నేతలంతా ఒక్కతాటి మీదకు వచ్చి.. ఇక బస్తీమే సవాల్ అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనతో దళితులు, గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలపై మండిపడ్డారు. అండగా మేముంటామంటూ భరోసా ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ సభ గిరిజనుల కోసం పెట్టినట్టు లేదని.. నాగం జనార్థన్ రెడ్డికి మద్దతుగానే అంత ఆర్భాటం చేశారంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అది వేరే విషయం.


ఇక, ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ సభ జరిగితే.. అదే మహబూబ్ నగర్ లో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుండటం ఆసక్తికరం. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ హాజరవడంతో పాటు బండి సంజయ్ అధ్యక్షతన కీలక రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్ సైతం పాలమూరులోనే నిర్వహించనున్నారు.

అదేంటి? అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అంతా పాలమూరు మీద పడ్డారేంటి అనే చర్చ నడుస్తోంది. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లాంటివి హైదరాబాద్ లో కదా జరిగేవి? ఇప్పుడేంటి పాలమూరులో పెడుతున్నారు? అనే సందేహం వస్తోంది. ఇటీవల పీఎం మోదీ పాలమూరు నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన పోటీకి.. పార్టీ మీటింగ్ కి ఏమైనా లింక్ ఉందా? అనే డౌటూ వ్యక్తమవుతోంది.


ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా స్టేట్ పాలిటిక్స్ హీట్ మీదున్నాయి. కాంగ్రెస్ అంతర్గత పోరుతో సైడ్ వేస్ లో మిగిలిపోయింది. ఇంఛార్జ్ గా థాక్రే వచ్చాక కుమ్ములాటలు కాస్త తగ్గాయి. రేవంత్ రెడ్డికి మరింత లైన్ క్లియర్ అయింది. దీంతో, మళ్లీ హస్తం నేతలు యాక్టివ్ అవడం.. నాగర్ కర్నూల్ లో దళిత, గిరిజన వర్గానికి మద్దతుగా ఆత్మగౌరవ సభ పెట్టడంతో బీఆర్ఎస్ కంటే బీజేపీనే ముందుగా అలర్ట్ అయింది.

కాంగ్రెస్ సభకు పోటీగా అన్నట్టు ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న గిరిజనుల నాగోబా జాతరను కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి బండి సంజయ్ సందర్శించారు. నాగోబా జాతరకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పోడు సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. గిరిజనులంటే చిన్నచూపు చూసే కేసీఆర్.. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీనే గిరిజనుల పక్షాణ పోరాడే పార్టీ అంటూ గిరిజనుడైన కేంద్ర మంత్రి సమక్షంతో తేల్చి చెప్పారు బండి సంజయ్.

ఈ రెండు ఘటనలు చూస్తే.. గిరిజనుల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయిన తెలిసిపోవట్లేదా అంటున్నారు. రేవంతేమో నాగర్ కర్నూల్ లో.. బండి సంజయేమో నాగోబాలో. రెండు పార్టీలూ గిరిజనులపైనే కన్నేశాయని చెబుతున్నారు. ఎందుకంటే, ఇటీవల ఆ వర్గం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. పోడు భూముల సమస్యతో ఇటీవల ఫారెస్ట్ ఆఫీసర్ నూ హత్య చేశారు కొందరు ఆదివాసీలు. అనేక జిల్లాల్లో పోడు గొడవలు జరుగుతున్నాయి. అందుకే, ఈసారి ఆ ఓటు బ్యాంకును ఎలాగైనా కైవసం చేసుకునేందుకే అన్నట్టు కాంగ్రెస్, బీజేపీలు సభలు పెడుతున్నాయని అంటున్నారు.

ఇక, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ రాజకీయ హడావుడితో కాక రేపుతున్నాయి. ఇక ప్రచారం జరుగుతున్నట్టు ప్రధాని మోదీ కనుక వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుంచి పోటీ చేస్తే.. రాజకీయం మరింత రంజుగా సాగడం ఖాయం. అంతా బాగానే ఉందికానీ.. కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చితే..? చివరాఖరికి మళ్లీ బీఆర్ఎస్ కే లాభమా? కొందరు అంటున్నట్టు కాంగ్రెస్ ను కంప్లీట్ గా సైడ్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×