Jangaon Municipality: జనగామ, స్వేచ్ఛ: జనగామ మున్సిపాలిటిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో దోస్తి కుదిరింది. సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నేతలంతా ఒక్కటయ్యారు. జనగామ కాంగ్రెస్‌లో ఉన్న మూడు ముక్కలాటకు నేతలంతా కలిసి ముగింపు పలికారు. డీసీసీ అధ్యక్షురాలు లాకావత్ ధన్వంతి చొరవతో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులను తాత్కాలికంగా పక్కనపెట్టారు. కాంగ్రెస్‌లోని వర్గపోరుతో సతమతమైన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు కలిసి మున్సిపోల్ బరిలో దూసుకుపోతున్నారు. తామంతా ఒక్కటే అని కాంగ్రెస్ చాటి చెప్పడంతో కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌తో కలిసి వచ్చారు. సీట్ల పంపకాల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ నేతలకు సహకరించారనే ప్రచారం ఉంది. అందుకే సీట్ల పంపకంలో మూడు పార్టీలు సమన్వయంతో, గెలుపు గుర్రాలకు, గెలిచే అవకాశం ఉన్న సీట్లను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. కమ్యూనిస్టులతో పొత్తు కుదరడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు జత కట్టడంతో గెలుపు నల్లేరుమీద నడకే అనే విధంగా ముందుకు పోతున్నారు.
Also Read:CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో సీఎం మీటింగ్!
జనగామ ప్రాంతం కమ్యూనిస్టులకు కంచుకోట ఒకప్పుడు. ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాటాలు చేస్తున్నప్పటికి అప్పటి ప్రాభల్యం ఇప్పుడు లేకుండా పోయింది. జనగామ ను కమ్యూనిస్టులు ఏలిన రోజుల నుంచి ఇప్పుడు కౌన్సిలర్స్‌ను గెలిపించుకుంటే తమ ఉనికి ఉంటుందని గ్రహించే స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులతో జత కట్టాలని ఉవ్వూళ్లూరిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కమ్యూనిస్టులే కాంగ్రెస్‌తో జత కడితే ఒకటో రెండో సీట్లు వస్తాయనే దశకు చేరుకుంది. అయినప్పటికి పోరాటాల పురిటిగడ్డ జనగామలో కమ్యూనిస్టులు తమ పోరాటాలతో ఉనికిలో ఉన్నారు. పోరాటాలతో ఎంతో కొంత క్యాడర్‌ను కలిగిన కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తు కుదిర్చుకుని సీట్ల పంపకాలు చేసుకున్నారు. జనగామ పట్టణంలో 30వార్డులు ఉండగా సీపీఐ ఎం కి మూడు, సీపీఐకి ఒకటి కౌన్సిలర్ వార్డులను కాంగ్రెస్ ఇచ్చింది. 26వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. సీపీఐకి 11వ వార్డును కెటాయించగా ఆకుల సరస్వతి పోటీలో ఉన్నారు. ఇక సీపీఐ ఎం 3వ వార్డులో బూడిద జ్యోతి, 5వ వార్డులో జోగు ప్రకాశ్, 7వార్డులో ఎండి గౌసియా పోటీలో ఉన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత జనగామ మున్సిపాలిటిలో కాంగ్రెస్ జెండా ఎగురలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీకి చెందినవారే చైర్‌పర్సన్‌లుగా ఎంపికయ్యారు. 2014లో గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, 2020లో పోకల జమున లు ఎంపికయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ చేతికి చైర్మన్ పీఠం దక్కుతుందా అనేది తేలాల్సి ఉంది. కమ్యూనిస్టుల పొత్తుతో కాంగ్రెస్ గట్టెక్కుతుందా, గ్రూపు తగాదాలతో చేజేతులారా పీఠాన్ని చేజార్చుకుంటుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉన్న ప్రాభవం ఇప్పుడు జనగామలో కనిపించడం లేదనే ప్రచారం కాంగ్రెస్‌లోనే ఉంది. పొన్నాల లక్ష్మయ్య వర్గం ఇప్పటికి కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతుంది. ఇప్పటి డీసీసీ అధ్యక్షురాలు లాకావత్ ధన్వంతి సైతం పొన్నాల శిష్యురాలే కావడం గమనర్హం. కాంగ్రెస్‌లో ఆర్ధిక వనరులు ఉన్న నేతలు అనేక మంది ఉన్నారు. జనగామ ఇన్‌చార్జీ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ప్రస్తుత భువనగరి ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డిలు తమ ప్రాభల్యం కోసం ప్రత్యేక అనుచర వర్గాన్ని కలిగి ఉన్నారు. జనగామ కాంగ్రెస్‌లోకు బలమైన నేతలు ఉన్నప్పటికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎత్తుల ముందు ఎలా నెగ్గుకొస్తారు అనేది త్వరలో తేలిపోనున్నది.