Congress Party: కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. టిక్కెట్ల అంశంలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మెజార్టీ మున్సిపాలిటీల్లో ఇదే సమస్య నెలకొన్నది. కాంప్రమైజ్ కావాలని టీపీసీసీ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ, మున్సిపాలిటీల్లో బీఫామ్ లు రాని నేతలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది. పదేళ్లుగా పార్టీలో పనిచేసిన కొందరు నేతలు స్పాట్ లోనే రిజైన్ చేస్తున్నామని ప్రకటించారు.
ఇవి పార్టీకి తలనొప్పిగా మారాయి. డీసీసీలు రంగంలోకి దిగి సర్టుబాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ, ఎలాంటి ఫలితం లేదు. దీంతో కాంగ్రెస్ లో బీ ఫామ్ ల పంచాయితీ రొడ్డెక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్‌తో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీకి, సొంత పార్టీ నేతల అసమ్మతి సెగ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఏ మున్సిపాలిటీ చూసినా “పాత నేతలు వర్సెస్ కొత్త నేతలు” అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితిని పరిశీలించిన టీపీసీసీ కూడా అసహనానికి లోనైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో టికెట్ల కేటాయింపు వ్యవహారం (Congress) కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ‘కొత్త’ నేతలు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ‘పాత’ కేడర్ మధ్య టికెట్ల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా బీఆర్ ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మల్యేల పరిధిలోని మున్సిపాలిటీల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నది. జగిత్యాల లో సీనియర్ నేత జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య పోరు వీధిన పడింది. జీవన్ రెడ్డి అనుచరులకు మున్సిపాలిటీల్లో బీ ఫామ్ లు రాలేదని వర్గపోరు బయటపడింది. మొదట్నుంచి పార్టీని కాపాడిన తమకు టికెట్లు ఇవ్వరా? అంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫాలోవర్స్ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
ఇక జనగామ ,ఖమ్మం లాంటి చోట్ల కూడా టికెట్ల పంపిణీపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. తమ వర్గానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు నాయకులు గాంధీ భవన్ మెట్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.మహబూబాబాద్ లో 14 లక్షలకు టిక్కెట్ అమ్ముకున్నారంటూ మాజీ కౌన్సిలర్ ఒకరు ఆరోపించారు. డీసీసీ ప్రెసిడెంట్ ఉమా మురళీ నాయక్ తమకు అన్యాయంచేసిందంటూ విమర్శలు వర్షం కురిపించారు. సంగారెడ్డి జిన్నారంలో 4 వ వార్డులో తనకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్తోళ్లకు ఇచ్చారంటూ ఓ మహిళా రొడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. బెల్లంపల్లిలోనూ బీ ఫామ్ లు రాని నేతలు ఏకంగా ఎమ్మెల్యే ముందే విమర్శలు కురిపించుకున్నారు. మెట్ పల్లిలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. పదేళ్లుగా పార్టీని మోసిన తమకు అన్యాయం చేశారంటూ ఓ మహిళా తీవ్ర విమర్శలు చేసింది.
గద్వాలలోనూ పాత, కొత్త నేతల మధ్య బీ ఫామ్ ల లొల్లి ఏర్పడింది. టికెట్లు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు,ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా రాజీనామా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.జగిత్యాల 26వ వార్డు అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చడంపై స్థానిక నేతలు భగ్గుమన్నారు.తమకు టిక్కెట్ రాకపోవడంతో రిజైన్ చేస్తామని స్పాట్ లోనే ప్రకటించారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్ వంటి చోట్ల టికెట్ దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా (రెబల్స్) నామినేషన్లు వేయడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. సంగారెడ్డి మున్సిపాలిటీల్లోనూ విభేదాలు రాగ,ఏకంగా జగ్గారెడ్డి ఇన్వాల్వ్ అయి, సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy)పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు జిల్లా ముఖ్య నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. “రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు ఇస్తాం, ఇప్పుడు సహకరించండి” అని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో నేతలు వినడం లేదు. “ఇప్పుడు టికెట్ రాకపోతే రాజకీయ భవిష్యత్తు ఏంటి?”అని ఆయా లీడర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఇన్-ఛార్జ్ మంత్రులు జిల్లాల్లోనే మకాం వేసి బుజ్జగింపులు జరుపుతున్నా, ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్ముకుని ఓట్లు అడగాలని భావిస్తున్న పార్టీకి, ఈ అంతర్గత ‘పంచాయితీ’ పెద్ద ఆటంకంగా మారింది. రెబల్స్ భారీగా బరిలో ఉంటే ఓట్లు చీలిపోయి ప్రతిపక్షాలకు లాభం చేకూరుతుందనే భయం కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ‘చార్జిషీట్’ విడుదల చేయగా, బీఆర్ఎస్ అభివృద్ధి శూన్యమంటూ ప్రచారం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు ప్రతిపక్షాల దాడి, మరోవైపు సొంత పార్టీ నేతల తిరుగుబాటు.. వెరసి కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఫిబ్రవరి 11న జరగబోయే పోలింగ్ నాటికి ఈ అసమ్మతి సెగను పార్టీ ఎంతవరకు కంట్రోల్ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
Also Read: Kavitha Effect on BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొత్త సవాల్.. కవిత ఎదుగుదలే గులాబీకి ముప్పా?