CM Revanth Reddy: చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా పేరుతో మూడు రకాల పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా చేనేతల భవిష్యత్‌కు భద్రత, వారి జీవనానికి సాయంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే.. పథకం అమలుకు అనుసరించనున్న మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిస్తూ జీవో జారీ చేసింది.
ఈ ఏడాది తెలంగాణ నేతన్న పొదుపు పథకానికి రూ.15 కోట్లు, చేనేత, పవర్‌లూమ్ కార్మికుల బకాయిలకు రూ.15 కోట్లు, నేతన్న భద్రతలో భాగంగా నేతన్న బీమా పథకానికి రూ.5.25 కోట్లు, నేతన్నకు భరోసా పథకానికి రూ.31 కోట్లు, వేతన ప్రోత్సాహకాలకు రూ.31 కోట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం కింద చేనేత, పవర్‌లూమ్, అనుబంధ కార్మికులు వేతనాల నుంచి నెలవారీగా 8శాతం వాటాధనం జమ చేస్తారు. దీని గరిష్ఠ పరిమితి రూ.1,200. ఇందుకు ప్రభుత్వం 16శాతం అందిస్తుంది. తెలంగాణ నేతన్న భద్రత పథకంలో నమోదైన కార్మికుడు ఏ కారణంగానైనా మృతిచెందినా రూ.5 లక్షలు అతని నామినీకి అందుతుంది. ఈ పథకంలో 65 ఏళ్ల గరిష్ఠ వయో పరిమితిని ఎత్తివేశారు. 59 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి బడ్జెట్ అంచనా వ్యయం రూ.9కోట్లు. తెలంగాణ నేతన్న భరోసా పథకం.. జియో ట్యాగ్ అయిన మగ్గాల నుంచి నిర్దిష్ట ఉత్పత్తి ప్రమాణాల ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్ఠంగా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేల వేతన సహాయం అందిస్తారు.
Also Read: Jobs in Bharat Electronics: భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్.. జీతం ఏడాదికి రూ.13,00,000
చేనేతల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. వారి జీవనానికి సాయంగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరి శ్రీనివాస్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా టీపీసీసీ చేనేత విభాగం ప్రెసిడెంట్ మస్నా రవి కుమార్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు పద్మశాలి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఆదుకునేందుకు పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డికి చేనేత నేతలు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సంగీశెట్టి జగదీశ్వర్, శ్రీ రామకృష్ణా పురం డివిజన్ డివిజన్ ప్రెసిడెంట్ పున్న గణేష్, తలాటి రమేష్, భోగ జగదీశ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ బాలె, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు నేత, జెల్ల జగన్నాథం సంఘం రమేష్, అమృతం కళ్యాణ్, శివ కుమార్, ఏజిపి హిమాంష్ వర్మ, హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరుల పాల్గొన్నారు.