Jagga Reddy On BRS: మీ బ్రతుకంతా కుట్రలమయం. ఒక్కసారి మీ పరిపాలనలో ఏమేమి పాపాలు చేశారో, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తెలంగాణ అభివృద్ధికి ఆటంకం మీరు. మీకు అభివృద్ధి చేయడం చేతకాదు.. చేస్తుంటే సహించలేరు.. ఇదే మీ వక్రబుద్ధి అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ లోని పీసీసీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బలవంతంగా రైతుల భూములను లాక్కున్న విషయాన్ని కేటీఆర్ మరచిపోయారన్నారు. బీఆర్ఎస్ పావలా పనిచేసి రూపాయి పబ్లిసిటీ చేసుకోవడంలో ఎప్పుడు ముందుంటుందన్నారు.
తమ ప్రభుత్వం హయాంలో రైతుల అభిప్రాయ సేకరణకై గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా బలవంతంగా రైతుల భూములను లాక్కున్నట్లు విమర్శించారు. కొడంగల్ ప్రాంతం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్లపూరితంగా వ్యవహరిస్తుందన్నారు.
మల్లన్న నిర్వాసితులపై పోలీసులతో అడ్డుకొని, దాడి చేయించిన ఘటనలు బీఆర్ఎస్ హయంలో జరిగాయన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో బీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందని, ప్రజలు ధర్నాలు కూడా చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. తెలంగాణను దోచుకున్న దొంగల ముఠాగా బీఆర్ఎస్ పార్టీని అభివర్ణించిన జగ్గారెడ్డి.. మీ బ్రతుకంతా కుట్రలమయం అంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, తాము రూపాయి పనిచేసి పావలా పబ్లిసిటీ కూడా చేసుకోలేకపోతున్నట్లు జగ్గారెడ్డి నిరాశక్తత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాన్ని కేటీఆర్ ఇప్పటికైనా మానుకోవాలని, తెలంగాణ అభివృద్ధి కావద్దన్నది వారి కుట్రగా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే తాము మహిళలకు ఫ్రీ బస్సు, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చామని, అలాగే పలు జాబ్ నోటిఫికేషన్స్ తో నిరుద్యోగులకు ఉద్యోగ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. త్వరలోనే మహిళలకు నెలకు రూ. 2500 లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే పెన్షన్ కూడా పెంచే నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్న బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జగ్గారెడ్డి అన్నారు.