Akshara Singh : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటీనటులకు భద్రత కరువైనట్టుగా కన్పిస్తోంది. కొన్ని రోజుల నుంచి సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్స్ హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న వార్తలు అభిమానులను ఆందోళకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్ (Akshara Singh) కూడా చేరింది.
భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అక్షర సింగ్ (Akshara Singh)కు తాజాగా హత్య బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడ్డ ఆ అజ్ఞాత వ్యక్తులు రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో ఆమె ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 11 రాత్రి ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది, ఈ నటికి వేర్వేరు నంబర్ల నుండి ఒక నిమిషం వ్యవధిలో రెండు కాల్స్ వచ్చినట్టు సమాచారం.
బీహార్‌లోని దానాపూర్ పోలీస్ స్టేషన్‌లో అక్షర (Akshara Singh) చేసిన ఫిర్యాదు ప్రకారం కాలర్ ఆమెతో ఫోన్లో దుర్భాషలాడాడు. అంతేకాకుండా చంపేస్తానని బెదిరించాడు. రెండు రోజుల్లో అడిగినంత డబ్బులు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాల్ చేసిన వ్యక్తి హెచ్చరించాడు. బెదిరింపుతో షాక్ తిన్న అక్షర వెంటనే విషయాన్ని అధికారులకు తెలియజేసింది. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. దానాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ప్రశాంత్ కుమార్ భరద్వాజ్ ఫిర్యాదు రావడం నిజమేనని తాజాగా మీడియాకు తెలిపారు. నిందితుల ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని భరద్వాజ్ చెప్పారు.
ఇక అక్షర సింగ్ (Akshara Singh) విషయానికొస్తే.. భోజ్‌పురి చిత్రాలలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. సత్యమేవ జయతే, సత్య, తబడ్లా, మా తుజే సలామ్ వంటి పాపులర్ చిత్రాలలో ఆమె నటించారు. అంతేకాదు అక్షర సింగ్ భోజ్‌పురి సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఆమె సినిమాలు మాత్రమే కాదు రియాలిటీ షో ‘బిగ్ బాస్’తో సహా పలు హిందీ టీవీ షోలలో కూడా కనిపించారు.
ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ (Salman Khan) కు కూడా హత్య బెదిరింపులు ఎదురు కాగా, అలా చేసింది ఒక యంగ్ సాంగ్ రైటర్ అని పోలీసులు కనిపెట్టారు. అలాగే అతన్ని అరెస్ట్ చేయగా, కేవలం తన పాట పాపులర్ కావడం కోసమే ఇలా చేశానని సదరు రైటర్ చెప్పినట్టు వార్తలు విన్పించాయి. అతను 5 కోట్లు ఇవ్వకపోతే, సల్మాన్ ను చంపేస్తామని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులం అని ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు మెసేజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.
మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుఖ్ (Shah Rukh Khan) కూడా ఇలాంటి బెదిరింపులనే ఎదుర్కొంటున్నారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో 308(4), 351(3)(4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తును చేపట్టిన పోలీసులు రాయ్‌పూర్‌లోని పాండ్రి మోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజాన్ ఖాన్‌గా గుర్తించారు. ఆ యువకుడిని ఇప్పుడు బాంద్రా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.