Congress Delay: స్వేచ్ఛ బ్యూరో: తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ క్షేత్రస్థాయి కాంగ్రెస్ లీడర్లు అగ్రనాయకత్వంపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవులు కేటాయింపుల్లో జాప్యంపై మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన క్షేత్రస్థాయి నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పటికీ దక్కకపోవడంతో విమర్శలు మొదలయ్యాయి.”పదవులు ఇస్తారా? లేక మమ్మల్ని పక్కకు తప్పుకోమంటారా?” అంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వం నేరుగా అధిష్టానాన్నే ప్రశ్నిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన పదవుల హామీలు, ఉగాది పండుగ నాటికి నామినేటెడ్ భర్తీ పూర్తి చేస్తామన్న టీపీసీసీ ప్రకటనలు అమలుకు నోచుకోకపోవడంతో కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. గతంలో ఉగాది పండుగ కల్లా నామినేటెడ్ పదవుల జాబితా విడుదల చేస్తామని టీపీసీసీ నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారు. పండుగ వెళ్ళిపోయి రోజులు గడుస్తున్నా, కనీసం జిల్లా స్థాయి కమిటీల భర్తీపై కూడా స్పష్టత రాకపోవడంతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కూడా సరైన స్పష్టత రాకపోవడంతో క్షేత్రస్థాయి లీడర్లు నిరాశతో ఉన్నారు. గతంలో పదవి కోసం గాంధీభవన్ చుట్టూ తిరిగిన కొందరు లీడర్లు..ఇప్పుడు ఆవైపు వెళ్లడం క్రమంగా బంద్ పెట్టేస్తున్నారు. రెండున్నర ఏళ్ల నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నారంటూ కొందరు లీడర్లు టీపీసీసీ కార్యవర్గంపై సీరియస్ అవుతున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోని పదవులూ ఎందుకు పెండింగ్ పెట్టారంటూ గ్రౌండ్ టీమ్ ప్రశ్నించడం మొదలు పెట్టింది. దీంతో డీసీసీ అధ్యక్షులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన డీసీసీ మీటింగ్ లలోనూ పదవులు వేగంగా ఇవ్వాలని పలువురు అధ్యక్షుడు డిమాండ్ చేయగా, ఉగాది పండుగను డెడ్ లైన్ గా విధించారు. కానీ ఇప్పుడు ఆ ఫెస్టివల్ కూడా ముగిసిపోవడంతో నేతలు ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తున్నది.
Also read: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే డేంజర్లో పడ్డట్లే.. మీ పర్సనల్ డేటా గోవిందా?
ఇక కొందరు క్షేత్రస్థాయి నేతలైతే తమ రాజకీయ భవిష్యత్ కు బెన్ ఫిట్ జరిగే ఇతర పార్టీలపై కూడా ఇప్పట్నుంచే స్టడీ మొదలు పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఏ పార్టీకి వెళ్తే బెటర్ అంటూ ఆరా తీస్తున్నారు. కొందరైతే జిల్లా స్థాయిలోనే నేరుగానే డీసీసీలకు చెప్తుండగా, మరి కొందరు గాంధీభవన్ కు లేఖలు రాస్తున్నారు. ఇన్ చార్జ్ మంత్రులపై కూడా ప్రెజర్ తెస్తున్నారు. త్వరలో సీఎం ను కూడా కలిసేందుకు కొన్ని జిల్లాల లీడర్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, కష్టపడిన నేతలకు గుర్తింపు లేకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలు, పార్టీలను ఎంచుకుంటామని సీఎంకు వివరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటనలు చేస్తున్న మంత్రులను పదవులపై గ్రౌండ్ టీమ్ ఎక్కడికక్కడ నిలదీస్తుంది. కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పే నాయకత్వం, ఆ కార్యకర్తలకు రావాల్సిన గుర్తింపును సకాలంలో అందించకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంది. అసంతృప్తి అసమ్మతిగా మారకముందే అధిష్టానం మేల్కొని నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదని ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.
సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా పదవుల పంపిణీలో సమతుల్యత సాధించడం పై పార్టీకి కత్తిమీద సాములా మారింది. ఇదే కారణంతో నామినేటెడ్ పదవులు లేట్ అవుతున్నట్లు టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. మరోవైపు మొదటి నుండి పార్టీని నమ్ముకున్న వారికి, ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారికి మధ్య పదవుల కేటాయింపులో తీవ్ర పోటీ నెలకొంది. పదవి ఎవరికి ఇస్తే పార్టీకి బెన్ ఫిట్ జరుగుతుందనే అధ్యయనం జరుగుతూనే ఉన్నది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎవరికి పదవి ఇస్తే పార్టీకి మైలేజీ వస్తుందనే లెక్కల్లోనే అధిష్టానం సమగ్రంగా స్టడీ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలోని కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవుల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గాంధీభవన్ తో పాటు జిల్లా కార్యాలయాల్లో అప్లికేషన్లు చేరాయి. ఇందులో కొన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకుల సిఫారసులూ ఉన్నాయి. మరి కొన్ని నేరుగానే దరఖాస్తు చేశారు. ఇందులో ఎవరి అప్లికేషన్లు సెలక్ట్ అవుతాయనేది కూడా సస్పెన్స్ గా నే ఉన్నది.
Also Read: తుపాకీ బదులు కర్ర ముక్కా.. స్మగ్లర్ల చేతిలో అధికారులు బలి అవ్వాల్సిందేనా..!