సెప్టెంబర్ 17.. కాంగ్రెస్ పార్టీ చూపు ప్రస్తుతం ఈ రోజుపైనే ఉంది. ఆ రోజున పార్టీ అగ్రనేతలంతా తరలిరానుండటంతో ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా చేరికల ద్వారా ఇతర పార్టీలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఓవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో డిక్లరేషన్ విడుదల చేసి.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్లు ద్వారా ప్రజలను ఆలోచింప చేయ్యనుంది. ఇలా సెప్టెంబర్17 పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం సర్వం సిద్దం చేస్తోంది. హైదరబాద్‌లో CWC సమావేశాలు.. ఆ వెంటనే విజయభేరి సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించనుంది. సెప్టెంబర్ 17 లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ నెల 16,17న CWC సమావేశాలు.. 18న జాతీయ స్థాయి నేతలంతా 119 నియోజకవర్గాల్లో పర్యటించనుండటంతో దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వచ్చే ఎన్నికలకు క్యాడర్‌లో జోష్ నింపాలని భావిస్తుంది.
CWC సమావేశాలకు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ స్థాయి నేతలంతా హాజరుకానున్నారు. ఈ భేటీలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలతోపాటు ప్రత్యేకంగా తెలంగాణ పై ఫోకస్ చేయనుంది కాంగ్రెస్. ఈ సమావేశాలతో పాటు సెప్టెంబర్ 17న తుక్కుగూడలో భారీగా విజయభేరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో చెప్పడానికి 5 గ్యారంటీ స్కిమ్స్ ప్రకటించనుంది. అంతేకాక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ ఛార్జిషీట్ ప్రకటించనున్నారు.
ఇక విజయభేరి సభ సాక్షిగా పార్టీలోకి భారీగా చేరికలను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 10 మంది ముఖ్య నేతలు చేరే అవకాశం ఉందనీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీ లతో సమావేశమైన షర్మిల చేరికకు చర్చలు తుది దశకు చేరడంతో సెప్టెంబర్ 17 సోనియా గాంధీ సమక్షంలో షర్మిల చేరిక ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. వీరితోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యే తోపాటు మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, ఆరెపల్లి మోహన్, ఏనుగు రవీందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్ లాంటి వారితో ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు సమాచారం.
ఇక అధికార పార్టీలో టికెట్ రాని కొంతమంది నేతలతోపాటు కేసీఆర్‌ని గద్దె దించే లక్ష్యంతో బీజేపీలో చేరిన నేతలతో సైతం కాంగ్రెస్ పెద్దలు అత్యంత రహస్యంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వీరి పేర్లు లీక్ ఇవ్వకుండా డైరెక్ట్ సోనియా గాంధీ సభలో పార్టీ కండువా కప్పుకునేలా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పార్టీ క్యాడర్ బలంగా ఉండి బలమైన నేతలు లేని నియోజకవర్గాలే అధికంగా ఉన్నాయని వారిని పార్టీలో చేర్పించి అక్కడ విజయవకాశాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపన్నహస్తం పేరుతో 5 గ్యారంటీ పథకాలు ప్రకటించడంతోపాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్‌తో క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇంత మంది కాంగ్రెస్ దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించడం కాంగ్రెస్ పార్టీకి జోష్ తెస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు .