Congress Party – MLC Elections: తెలంగాణలో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల మూడు జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు ఆవశ్యకతను గ్రాడ్యుయేట్స్‌కి వివరించే ప్రయత్నం చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
పాలనాపరంగా ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణపై వేలెత్తి చూపే అవకాశాన్ని విపక్షాలకు ఇవ్వకుండా గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటు వేయాలని కాంగ్రెస్ కోరుతోంది. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఎన్నో దశాబ్దాల కలలుగా మిగిలిన ఈ అంశాలను అమలు చేసి చూపిన ప్రభుత్వ పనితీరుకు బాసటగా నిలవాలని అధికార పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులను ఆలోచింజేసేలా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన 3 నెలల కోడ్ పోనూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 9-10 నెలల పాలనలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఉద్యోగాల భర్తీ అంశం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భర్తీ చేయని ఉద్యోగాలను, కేవలం ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయడం నిరుద్యోగులను ఆకర్షిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే టెట్ నిర్వహించడంతోపాటు 11 వేల టీచర్ పోస్టుల భర్తీ సహా పోలీసు శాఖలో 16 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వివరిస్తోంది. అంతేకాకుండా 6 వేల మంది పారామెడికల్ సిబ్బందిని నియమించి ఘనంగా నియామక పత్రాలలను అందించిన విషయాన్ని కాంగ్రెస్ బలంగా ఓటర్ల దృష్టికి తీసుకెళుతోంది. ఈ అంశాలన్ని కూడా కేవలం ఉద్యోగాల భర్తీగానే చూడకుండా.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో తమ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కాంగ్రెస్ గ్రాడ్యుయేట్లకు వివరిస్తోంది.
ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా 30 వేల మంది టీచర్ల బదిలీలు చేపట్టి 35 వేల మందికి ప్రమోషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీకి మరో ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం 9-10 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని వివరిస్తోంది.
కాన్ఫిడెంట్‌కు కారణం ఇదే..
ఎన్నికల్లో గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అండగా ఉంటాం.. ఆదుకుంటాం అనే డైలాలుగు కాకుండా.. అధికారంలోకి వచ్చిన అనంతరం తమ ప్రజాపాలనను చూసి ఓటేయాలని గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ కోరుతుండడం కొసమెరుపు. 55,143 ఉద్యోగాలు ఇవ్వడం వాస్తవమని విశ్వసిస్తుంటేనే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటువేయాలని కోరుతోంది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు చేసి ఉంటేనే ఓటువేయాలని ఆ వర్గాల్ని విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాకుండా రూ.21 వేల కోట్ల రుణమాఫీ, రైతు భరోసా సాయం పొందివుంటేనే ఓటు వేయాలని కోరుతోంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందుతున్నట్టైతేనే తమకు ఓటు వేయాలని బహిరంగంగా పిలుపునిస్తోంది. ఈ రకంగా పరిపాలనా తీరుతెన్నుల ఆధారంగానే ఓట్లు అడుగుతుండడం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుపై తమకున్న విశ్వాసానికి ప్రతీక అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తమ పాలనపై నిరుద్యోగులు, ఉద్యోగులు ఆశావహంగా ఉండడానికి కాంగ్రెస్ కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తోంది. గత పదేళ్లలో నిరుద్యోగులు, ఉద్యోగుల పట్ల బీఆర్ఎస్ అవలంబించిన అణచివేత ధోరణి, తమ ప్రజాపాలన తీరును బేరిజు వేసుకోవాలని చెబుతోంది.
యువతలో నైపుణ్యాల పెంపునకు స్కిల్ డెవలెప్‌మెంట్ యూనివర్శిటీ, వెనువెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ (అది కూడా ఎలాంటి తప్పిదాలు, పేపర్ లీకులకు ఆస్కారం ఇవ్వకుండా), ఉద్యోగులు ఏళ్లుగా ఆశిస్తున్న బదిలీలు వంటి అంశాల్లో ప్రజల మనసెరిగి కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తోందని, ఈ అంశాలే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన మధ్య వ్యత్యాసాన్ని చూపుతున్నాయని చెబుతోంది. ఇక వర్గీకరణ అంశాలు తేలినవెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇస్తోంది. ఇవే గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులను తమకు చేరువ చేస్తాయని, తద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో తమ గెలుపు సునాయాసమే అని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.