BRS Vs Congress: డోర్నకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ విప్ రామచంద్రనాయక్ బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ది పనుల జరగలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని తేల్చి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబంలో అవినీతి పనులు చేసిన ఏ ఒక్కరికి శిక్ష తప్పదని అన్నారు. అవినీతి సొమ్ముతో కేటీఆర్ కళ్లు మూసుకుపోయాయని తీవ్రంగా విమర్శించారు. ఫార్ములా ఈ -రేస్ వ్యవహారంలో కేటీఆర్ అవినీతి చేశారని డోర్నకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ విప్ రామచంద్రనాయక్ ఆరోపించారు.
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో అవినీతిపైన ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ, ఈడీ తేల్చాయని అన్నారు. ఫార్ములా ఈ రేస్ లో తెలంగాణ ఆదాయానికి సీఎం రేవంత్ రెడ్డి గండి కొట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దగ్గర మార్కుల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మతి తప్పి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో వైద్యులకు చూపించాలని తీవ్రంగా విమర్శించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ నెత్తిపైన వెంట్రుకలు కాదు కదా.. ఆయన తలలో మెదడు కూడా లేదని దారుణంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రవీణ్ కుమార్ ఓ తాబేదారు అయ్యాడని.. కేసీఆర్ ఇచ్చే నాలుగు పైసలకు కక్కుర్తి పడి మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చారు. పదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు చేసిన పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వత్తాసు పలకడం దారుణమన్నారు. కేసీఆర్ కుటుంబానికి జీతగాడిలా మారిన ప్రవీణ్ కుమార్ పైన ఇప్పటి వరకు ఉన్న గౌరవం పోయిందని రామచంద్రానాయక్ ఆరోపించారు.
Also Read: Cricket Stadium: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మన అమరావతిలో.. ఎప్పుడంటే..?
రాబందుల సమితిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనకేసుకు వస్తున్నారని.. దళిత, గిరిజన, బహుజన విద్యార్థులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన మోసం అంతా ఇంతా కాదని అన్నారు. దళిత, గిరిజన, బహుజనుల హక్కుల కోసం పోరాడుతానని చెప్పి చివరకు ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ చేరారు. ఫామ్ హౌస్ గోడలను బద్దలు కొడతానని చెప్పి ఇప్పుడు అక్కడే ఊడిగం చేస్తున్నారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు కనీసం సిగ్గు, శరం లేదని అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు అనుమతి లేకుండా కేటీఆర్ పంపించాడని అన్నారు. ఫార్ములా ఈ రేస్ కంపెనీ లకు పంపించిన డబ్బు ను తిరిగి పార్టీ ఫండ్ గా కేటీఆర్ తెచ్చుకున్నాడు. అవినీతి సొమ్ముతో కేటీఆర్ కళ్లు మూసుకుపోయాయని.. పిచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికైనా పిచ్చి మాటలు కట్టి పెట్టాలని చెప్పారు.