Congress vs BRS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో.. రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గతంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో, తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతీకారం తీర్చుకున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఫర్నీచర్ ను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దాడిలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని, నినాదాలు చేస్తూ జెండాను కూల్చేశారు. బీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలను చింపేశారు. తర్వాత పార్టీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆ వస్తువులకు నిప్పంటించారు. ఈ ఘటనతో క్షణాల్లో ఆఫీస్ మొత్తాన్ని మంటలు ఆవరించాయి.
కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఈ భవనం మొదట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్రమించుకున్నారు. ఇప్పుడు మేము తిరిగి మా పార్టీ రంగులు వేస్తున్నాం అని అన్నారు. కార్యకర్తలు ఆఫీస్ గోడలపై కాంగ్రెస్ రంగులు పూసి, పార్టీ జెండాలను ఎగురవేశారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ విషయంలో కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
సమాచారం అందుకున్న వెంటనే మణుగూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగకుండా పోలీసులు మద్యవర్తిత్వం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.