Hyderabad News: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కింది. నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. పార్టీల నేతలు ఏం చేసినా అడ్డంగా బుక్కైపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.
జూబ్లీహిల్స్ బైపోల్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న పార్టీలు తమతమ వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. లేటెస్టుగా మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు ఆ ప్రాంత ఎన్నికల అధికారి రజినీకాంత్‌రెడ్డి. దీంతో ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేయడమే అందుకు కారణం.
ఈ అంశాన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి చర్యగా భావించారు ఎన్నికల అధికారులు. ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు రిజిస్టర్ అయ్యింది. ఈసీ నిబంధనల ఉల్లంఘనల మీద అధికారుల సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
నియోజకవర్గంపై ఈసీ అధికారుల నిఘా
ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఆ పార్టీ నేతలు షాకయ్యారు. కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పై కేసు నమోదు కావడం చర్చనీ యాంశంగా మారింది. నవీన్ జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులు అందజేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ALSO READ: ఏపీ-తెలంగాణలో వారం పాటు భారీ వర్షాలు
ఇక ఉపఎన్నికల విషయానికి వద్దాం. జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక తుది దశకు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ లో సమావేశంకానున్నారు.
దీని తర్వాత రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకే టికెట్టు అంటూ క్లారిటి ఇచ్చారు పిసిసి చీఫ్ మహేష్‌కుమార్. సోమవారం బెంగుళూరులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. అదే సమయంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నమాట. మంగళవారం మధ్యాహ్నం తర్వాత అభ్యర్థి ఎవరన్నది తేలిపోనుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. బీజేపీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేయనుంది త్రిసభ్య కమిటీ. సీనియర్ నేతలు, డివిజన్ అధ్యక్షులతోపాటు కార్పొరేటర్ల అభిప్రాయాలను తీసుకోనుంది కమిటీ. మంగళవారం సాయంత్రం అధిష్ఠానానికి ఓ నివేదిక ఇవ్వనుంది. బుధ లేదా గురువారాల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ, పద్మలు ఉన్నారు.