Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో దంచికొడుతుంది. రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, మైలదేవర్‌పల్లి, చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ చెరువులై పారాయి. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరో వారం రోజులు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..
అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొద్ది చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
ఏపీలో ఈ జిల్లాల ప్రజల అలర్ట్..
ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో పలు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ..
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
వర్షాల కారణంగా సముద్రంలోకి వెళ్లద్దని మత్స్యకారులకు సూచన..
తుపాను ముప్పు తప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో సముద్రంలో ఆటు పోట్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో చిన్న పడవలపై చేపల వేటకు వెళ్లే వారు ఇవాళ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు తెలియజేసారు. మరోవైపు తీర ప్రాంత ప్రజలు కొత్త పంటలను ఈ నెల తర్వాత సాగు చేస్తే మంచిదనే సూచనలు ఇస్తున్నారు. ఇప్పటి పలు ప్రాంతాల్లో వేసిన పంట వర్షాల పాలైంది. దీంతో రైతులు కూడా అప్రమత్తంగా మెలగాలని సూచిస్తోంది.