Hyderabad News : నిందితుల్ని పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులే వారితో చేతులు కలిపితే ఎలా ఉంటుంది. బాధితులకు సాయంగా నిలవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ పోలీస్ ఆ విషయాన్ని మరిచిపోయి.. నేరస్థులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తీరా విషయం బయటపడడంతో.. తెలంగాణ పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. సదరు డీఎస్పీని సస్సెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన రియల్ ఎస్టేట్ రంగంలో భారీ గిరాకీ ఉన్న హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. సస్సెండ్ అయిన డీఎస్పీ కిడ్నాపర్లకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2023లో మోకిలా గ్రామంలో ఒక రియల్టర్ కిడ్నాప్‌లో నేరస్థులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సైబర్ క్రైమ్ యూనిట్ నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి)ని సస్పెండ్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని మోకిలా ప్రాంతంలో రియల్ రంగం శరవేగంగా దూసుకుపోతుంది. అలాంటి చోట ఓ రియల్టర్ ని కిడ్నాప్ చేసేందుకు కొందరు నిర్ణయించుకున్నారు. అతని ద్వారా కోట్లు కొల్లగొట్టవచ్చనుకున్నారు. అందుకోసం.. ఏకంగా డీఎస్పీ స్థాయిలోని వ్యక్తి సాయాన్ని కోరగా.. అతను వారికి సహకరించారు. ఇందుకోసం.. పోలీసులకు మాత్రమే అనుమతిచ్చే తెలంగాణ పోలీస్ యాప్ లను వినియోగించినట్లు గుర్తించారు. ఆయా యాప్ ల ద్వారా మోకిలాకు చెందిన ఓ రియల్టర్ శ్రీనివాస్ రాజు ఆచూకీ గురించి సున్నితమైన సమాచారాన్ని సేకరించి, కిడ్నాపర్ల బృందానికి చేరవేశారని చెబుతున్నారు. పోలీసులు తెలుపుతున్న నివేదికలను బట్టి.. డీఎస్పీ అందించిన సమాచారం మేరకే.. నేరస్థులు మోకిలాలోని నాగులపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్ రాజును అపహరించారని పోలీసుల విచారణలో తేలింది. దాంతో.. పోలీసు వ్యవస్థలో అంతర్భాగంగా ఉండి.. నేరస్థులకు సహకరించిన పేరు వెల్లడించని డీఎస్పీపై వేటు పడింది.
డీఎస్పీ సహకారంతో శ్రీనివాస రాజును కిడ్నాప్ చేసిన దుండగులు.. అతన్ని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకున్నారు. అక్కడ అతని పేరుపై ఉన్న 30 ఎకరాల భూమిని.. వారిపై బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ బలవంతపు భూమి బదిలీ ద్వారా నేరస్థులు అక్రమంగా ఆస్తిని సంపాదించాలనుకున్నారు. కానీ.. వారి నుంచి తప్పించుకున్న శ్రీనివాస రాజు.. అక్కడి నుంచి తప్పించుకుని, పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన కిడ్నాప్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల.. విచారణలో తన శాఖలోని వ్యక్తి సహకారాన్ని గుర్తించారు.
Also Read : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా అమలు చేయాలో తెలుసు – మంత్రి దామోదర్ రాజనర్శింహ
నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఓ DSP నుంచి తమకు రాజు ఎక్కడ ఉన్నాడనే సమాచారం అందినట్లు వెల్లడించారు. దాంతో.. ఆ కిడ్నాప్ కేసులో డిఎస్పీని నిందితుడిగా చేర్చి, ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కేసును సమీక్షించిన తెలంగాణ పోలీసు శాఖ.. డిపార్టుమెంట్ లోని ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశించింది. దాంతో.. అతనిపై సస్పెండ్ వేటు పడింది. ఈ కేసు విషయంలో జవాబుదారీగా ఉంటామని తెలిపిన పోలీసు శాఖ.. నేరానికి పాల్పడింది ఎవరైనా, ఏ డిపార్ట్ మెంట్ అయినా.. చట్టం అందరికీ ఒకేలా పని చేస్తుందని ఈ సస్పెంన్షన్ ద్వారా నిరూపితమైందని అంటున్నారు.