SC Classification :
⦿ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవు
⦿ న్యాయపరమైన సమస్యలు రాకుండా వర్గీకరణపై ముందుకు
⦿ వివాదాలు సృష్టించి అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు
⦿ ఇప్పటికే ఆలస్యమైంది.. ఇంకా సాగదీసి ఎస్సీలకు అన్యాయం జరగనివ్వను
⦿ శాస్త్రీయంగా స్టడీ చేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.. కమిషన్ నివేదిక ప్రకారం ముందుకు
ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. దశాబ్దాల ఎస్సీ వర్గాల కలలను నిజం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ చొరవకు కృతజ్ఞతలు చెప్పేందుకు.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు కలిశారు. మంత్రిని సన్మానించిన, ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. మాదిగ కులాల నాయకులో మంత్రి మాట్లాడారు.
మాదిగ కులస్థుల సమష్టి కృషి, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతానికి.. సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధత తోడవడంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతోందన్నారు. వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో 14 ఏళ్లు పెండింగ్‌లో ఉన్న సంగతిని గుర్తు చేసిన మంత్రి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పినట్లు తెలిపారు. తమ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. స్వయంగా చేవెళ్ల డిక్లరేషన్‌లో వర్గీకరణపై ప్రకటన చేసినట్లు తెలిపారు.
అందరి ఆశీస్సులతోనే తాము అధికారంలోకి వచ్చామన్న మంత్రి దామోదర రాజనర్సింహ.. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్లను నియమించి ప్రభుత్వం తరపున వర్గీకరణకు అనుకూలంగా వాదించామని చెప్పారు. సీఎం రేవంత్ సూచనలతో మాదిగ నాయకులు, మేధావుల బృందాన్ని అనేక సార్లు దిల్లీకి తీసుకెళ్లి, విచారణ తీరును పర్యవేక్షించినట్లు తెలిపారు. దశాబ్ద కాలానికి పైగా పెండింగ్‌లో ఉన్న కేసులో 6 నెలల్లోనే తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆగస్టు ఒకటో తేదిన వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు వెలువడితే.. గంట లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం.. వర్గీకరణ చేసేందుకు కేబినేట్ సబ్ కమిటీని నియమించి, వర్గీకరణపై చర్చించిన విధానాన్ని వివరించారు. చట్టపరమైన సమస్యలు రాకుండా, వన్ మెంబర్ కమిషన్ నియమించినట్లు తెలిపారు. రిటైర్డ్ జస్టీస్ చైర్మన్‌గా ఉన్న వన్ మ్యాన్ కమిషన్ ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి, అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ పరమైన అంశాలపై స్టడీ చేసిందని వెల్లడించారు.
సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే డేటాను సేకరించిందన్న మంత్రి దామోదర్ రాజనర్శింహ.. అన్ని వర్గాల నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతి ద్వారా నెల రోజుల పాటు వినతులు స్వీకరించినట్లు వెల్లడించారు. సుమారు 8 వేలకు పైగా వినతులను పరిశీలించి, క్రోడీకరించి నివేదిక తయారు చేసినట్లు.. మాదిగ వర్గాల ప్రతినిధులకు తెలియజేశారు. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన రోజే కేబినేట్ సబ్ కమిటీ ఆమోదించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపిన మంత్రి.. ఆలస్యం కావొద్దు, ఇంకా అన్యాయం జరగొద్దనే ప్రభుత్వం సత్వరంగా స్పందించిందన్నారు. క్రిమిలేయర్ పెట్టాలన్న కమిషన్ రికమండేషన్‌ను రిజెక్ట్ చేశామన్నారు. జనాభా, empirical data ఆధారంగా మూడు గ్రూపులుగా మొత్తం 59 కులాలను కమిషన్ వర్గీకరించిందన్నారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు సుమారు 9.8 శాతం రిజర్వేషన్లు సాధించినట్లు తెలిపిన మంత్రి రాజనర్సింహ.. గ్రూప్ వన్‌లో 0.77 శాతం, గ్రూప్ 2లో 9 శాతం మాదిగ వర్గాలకు దక్కినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా అన్యాయం జరగొద్దన్న సదుద్దేశంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోర్టు కేసులు, లీగల్ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వర్గీకరణను ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు.
వర్గీకరణ జరగడం ఇష్టం లేని వ్యక్తులు.. వర్గీకరణ పేరిట మనుగడ సాగించాలనుకునే వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్న రాజనర్శింహ.. తాను తప్పుడు మాటలు మాట్లాడి జాతిని మోసం చేసే వ్యక్తిని కాదన్నారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాల, మాదిగల నడుమ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించి వర్గీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.