Mad Square : సెన్సేషనల్ కామెడీ మూవీ ‘మ్యాడ్’ (Mad)కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). ఉగాది సందర్భంగా మార్చి 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుండగా, తాజాగా మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే ‘మ్యాడ్’ సినిమాలో కంటే ‘మ్యాడ్ స్క్వేర్’లో రెట్టింపు ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉండబోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ మ్యాడ్ నెస్ లోకి మరో స్టార్ హీరో అడుగు పెట్టబోతున్నారన్న విషయాన్ని తాజాగా నిర్మాత నాగ వంశీ (Suryadevara Nagavamsi) లీక్ చేశారు.
‘మ్యాడ్’ ఫ్రాంచైజ్ లోకి స్టార్ హీరో
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియ, గోపిక ఉదయన్, అనంతిక తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. మార్చ్ 29 నుంచి ఈ మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఒక బిగ్ లీక్ ఇచ్చారు. ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మ్యాడ్, టిల్లూ ఇద్దర్నీ ఒకే సినిమాలో కలుపుతారనే టాక్ నడుస్తోంది? అందులో ఎంతవరకు నిజముంది? అనే ప్రశ్నకి “కాదు గానీ.. మ్యాడ్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ లో ఈ ముగ్గురినీ ఓ పెద్ద స్టార్ తో కలుపుదాం అని అనుకుంటున్నాను” అని బిగ్ లీక్ ఇచ్చారు నాగ వంశీ. దీంతో ఆ బిగ్ స్టార్ ఎవరు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఉన్న మ్యాడ్ నెస్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పెళ్లికి మూడు రోజుల ముందు గోవాకి వెళ్లి ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్, ఆ తర్వాత పోలీసుల దగ్గర ఈ గ్యాంగ్ చిక్కుకోవడం, కొడుకు కోసం గోవాకు వచ్చి విలన్ల చేతిలో మురళీధర్ గౌడ్ తన్నులు తినడం, ట్రైలర్ లో ఉన్న సరదా డైలాగులు అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ట్రైలర్లో సత్యం రాజేష్, డైరెక్టర్ అనుదీప్ కేవీ గెస్ట్ రోల్స్ లో కనిపించడం మరింత క్యూరియాసిటీని పెంచింది.
‘రాబిన్ హుడ్’ వర్సెస్ ‘మ్యాడ్ స్క్వేర్’
ఇదిలా ఉండగా, మార్చి 29న ‘మ్యాడ్ స్క్వేర్’ మాత్రమే కాదు మరో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ కూడా అదే డేట్ కి రిలీజ్ కాబోతోంది. మరి ఈ బాక్స్ ఆఫీసు ఫైట్ లో ఈ రెండు సినిమాలలో విన్ అయ్యేది ఎవరో చూడాలి.