Medak: దొంగతనం కేసు. అసలే పోలీసులు. ఊరుకుంటారా. అనుమానంతో నిందితుడు ఖదీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు పెట్టాలి.. కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ, ఖాకీలు అలా చేయలేదు. పోలీస్ టార్చర్ రుచిచూపించారు. కట్ చేస్తే.. ఆ నిందితుడు చనిపోయాడు. పోలీసులపై యాక్షన్ మొదలైంది.
చనిపోక ముందు ఖదీర్ ఖాన్ పలు విషయాలు చెప్పాడు. పోలీసులు తనను టార్చర్ చేసిన విధానం పూసగుచ్చినట్టు వివరించాడు. జనవరి 29న హైదరాబాద్ లో అదుపు తీసుకున్నారట. కారులో మెదక్ కు తరలిస్తూ.. 2 గంటల పాటు వాహనంలోనే కొట్టుకుంటూ తీసుకొచ్చారని చెప్పాడు. మళ్లీ మెదక్ పోలీస్ కస్టడీలో రాత్రంతా కొడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతులు, కాళ్లు, నడుము మీద విచక్షణారహితంగా తనను కొట్టారని వాపోయాడు.
ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్ లు తనకు కొట్టారని ఆరోపించాడు. ఆ ముగ్గురిలో ప్రశాంత్ అనే కానిస్టేబుల్ మరీ దారుణంగా కొట్టాడట. తాను దొంగతనం చేయలేదని చెబుతున్నా ఆ ఖాకీలు వినిపించుకోలేదట. ఫిబ్రవరి 2 వరకూ కస్టడీలోనే ఉంచుకొని.. ఆ తర్వాత చావు బతుకుల మధ్య ఉన్న తనను వదిలేశారని చెప్పుకొచ్చాడు. పోలీస్ దెబ్బలు తాళలేక, లేచి నిలుచోలేక.. ఆసుపత్రిలో చేరాడు ఖదీర్ ఖాన్. చికిత్స పొందుతూ గాంధీ హాస్పిటల్ లో ఈనెల 16న చనిపోయాడు. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడంటూ అతని భార్య సిద్దేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఖదీర్ ఖాన్ మరణంతో పోలీసులపై డీజీపీ అంజనీకుమార్ సీరియస్ గా స్పందించారు. మెదక్ ఎస్సై, సీఐలపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఘటనపై కామారెడ్డికి చెందిన సీనియర్ అధికారులతో దర్యాప్తు జరిపించాలని, వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు. ఇలా, మెదక్ లాకప్ డెత్ అంశం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.